wedding loans: వివాహానికి దీర్ఘకాల రుణాలు.. ఆర్థిక సంస్థల మరో ముందడుగు

  • రూ.25 లక్షల వరకు తీసుకునే సదుపాయం
  • చెల్లింపులకు ఈఎంఐ సదుపాయం
  • ఆన్ లైన్లోనే దరఖాస్తు చేసుకునే సదుపాయం

ఇంటి రుణం....వాహన రుణం...వ్యక్తిగత రుణం...ఇవీ ఇప్పటి వరకు మనం విన్న మాటలు. ఇప్పుడు కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలూ వివాహానికీ రుణం మంజూరు చేస్తామంటూ ఆహ్వానం పలుకుతున్నాయి. మీ ఇంట్లో శుభకార్యానికి 25 లక్షల రూపాయల వరకు రుణం అందిస్తామని, నెలవారీ చెల్లింపు సదుపాయం కల్పిస్తున్నామని చెబుతున్నాయి. 

'ఇల్లు కట్టి చూడు... పెళ్లి చేసి చూడు' అన్నది సామెత. ఈ ఆధునిక యుగంలో సింపుల్ గా పెళ్లి చేసుకుంటేనే లక్షల్లో వ్యయం. ఇక ఆడంబరాలకు, ఆర్భాటాలకు పోతే ఖర్చు సంగతి చెప్పక్కర్లేదు. దాచుకున్న డబ్బు, మరో సదుపాయం లేకుంటే పెళ్లి కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే కుటుంబాలు ఎన్నో. ఈ సమస్యను గుర్తించే ప్రైవేటు బ్యాంకుల్లో దిగ్గజమైన ఐసీఐసీఐ బ్యాంక్ వివాహానికి రుణం ఇస్తామంటూ ముందుకు వచ్చింది.

రుణం ఇచ్చేందుకు తాను సిద్ధమని టాటా క్యాపిటల్ కూడా ప్రకటించింది. ఐసీఐసీఐ బ్యాంక్ 11.25 శాతం వార్షిక వడ్డీ పై 20 లక్షల వరకు రుణం ఇచ్చేందుకు ముందుకు వస్తుండగా, టాటా క్యాపిటల్ 10.99 శాతం వార్షిక వడ్డీపై రూ.75 వేల నుంచి రూ. 25 లక్షల వరకు రుణం ఇస్తామని చెబుతోంది. ఔత్సాహికులు సంస్థ యాప్, ఆన్ లైన్ లోనైనా దరఖాస్తు చేసుకోవచ్చు. నేరుగా బ్రాంచికి వెళ్లి కూడా దరఖాస్తు అందించవచ్చు.

దరఖాస్తు అందాక అర్హత అంశాలు, ఆర్థిక పరిస్థితిపై విచారణ అనంతరం రుణం మంజూరు చేస్తామని ఈ సంస్థలు ప్రకటిస్తున్నాయి. ఎటువంటి ష్యూరిటీలు అడగకపోవడం, నామమాత్రపు డాక్యుమెంటేషన్, ఆస్తి తనఖా లేకపోవడం వంటి సదుపాయాలు వున్నాయని చెబుతున్నారు. తీసుకున్న రుణాన్ని 12 నెలల నుంచి 72 నెలల్లోపు తీర్చాల్సి ఉంటుందని టాటా క్యాపిటల్ పేర్కొనగా, ఖాతాదారునితో చర్చించాక టైమ్ షెడ్యూల్ విధిస్తామని ఐసీఐసీఐ బ్యాంకు చెబుతోంది.

More Telugu News