Madhya Pradesh: పెళ్లి పేరుతో కరడుగట్టిన నేరస్తుడ్ని ఉచ్చులోకి లాగిన మహిళా ఎస్సై

  • మధ్యప్రదేశ్ లో ఘటన
  • మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కోసం పోలీసుల వేట
  • పెళ్లి కోసం వచ్చిన పోలీసులకు పట్టుబడిన నేరస్తుడు

మధ్యప్రదేశ్ లోని ఛత్రాపూర్ లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. 16 క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్న బాలకిషన్ చౌబే అనే వ్యక్తిని ఓ మహిళా ఎస్సై అరెస్ట్ చేసిన విధానం అందరినీ విస్మయానికి గురిచేసింది. పెళ్లి చేసుకుంటానని ఆ మహిళా ఎస్సై ఆడిన డ్రామాకు బాలకిషన్ చౌబే అడ్డంగా బుక్కయిపోయాడు. అసలు విషయం ఏంటంటే... యూపీలోని మహోబా జిల్లా బిజౌరీ ప్రాంతానికి చెందిన చౌబే ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. అతని ఆచూకీ కోసం పోలీసులు నగదు బహుమతి కూడా ప్రకటించారు. పోలీసుల కళ్లు గప్పి తిరుగుతుండడంతో అతడిపై కేసుల విచారణ ముందుకు సాగడంలేదు.

ఈ నేపథ్యంలో, ఓ మహిళా ఎస్సై రంగంలోకి దిగి అతడిని ఉచ్చులోకి లాగింది. చౌబే పెళ్లి సంబంధాలు చూస్తున్నాడని తెలుసుకుని, అతడి ఫోన్ నెంబరుకు ఒక రోజు రాంగ్ కాల్ చేసింది. సారీ రాంగ్ నంబర్ అంటూ ఫోన్ పెట్టేసినా, ఆ తర్వాత మళ్లీ మళ్లీ అతడి నంబరుకు కాల్ చేస్తూ పరిచయం పెంచుకుని మాటల్లో దింపింది. అంతేకాదు, అతడు పెళ్లి వరకు వెళ్లేలా ఆ మహిళా ఎస్సై మాటలతో గమ్మత్తు చేసింది.

ఒకరోజు చౌబే పెళ్లి ప్రపోజల్ తీసుకురావడంతో ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్న మహిళా ఎస్సై అతడిని బిజౌరీ గ్రామంలో ఉన్న ఆలయానికి రమ్మని ఆహ్వానించింది. అసలు విషయం తెలియని ఆ నేరస్తుడు, కొత్త పెళ్లికొడుకులా గుళ్లో అడుగుపెట్టాడు. అప్పటికే అక్కడ మఫ్టీలో కాచుకుని ఉన్న పోలీసులు చౌబేను పట్టుకుని అరదండాలు వేశారు. ఓ హార్డ్ కోర్ క్రిమినల్ ను చాకచక్యంగా పట్టుకున్న ఆ మహిళా సబ్ ఇన్ స్పెక్టర్ ను ఉన్నతాధికారులు అభినందించారు. నేరస్తుడు చౌబేను కోర్టుకు హాజరు పర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.

More Telugu News