Disha: ప్రియాంక రెడ్డి హత్యకేసు వివరాలు వెల్లడించిన సీపీ సజ్జనార్!

  • వెటర్నరీ డాక్టర్ పై అత్యాచారం, హత్య
  • సంచలనం సృష్టించిన ఘటన
  • నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసులో నిందితులు నలుగుర్ని అరెస్ట్ చేసినట్టు సీపీ సజ్జనార్ తెలిపారు. దర్యాప్తు వివరాలు వెల్లడించేందుకు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 28వ తేదీ రాత్రి 11 గంటలకు తమకు మిస్సింగ్ అంటూ ఫిర్యాదు అందిందని తెలిపారు. ఆ తర్వాత ఘటనకు సంబంధించి ప్రియాంక మృతదేహం కనిపించిందని, అది తమ బిడ్డదేనని ప్రియాంక తండ్రి చెప్పారని వెల్లడించారు.

ఈ ఘటనకు పాల్పడిన వాళ్లు మహ్మద్ ఆరిఫ్ (26), జొల్లు శివ (20), జొల్లు నవీన్ (20), చింతకుంట చెన్నకేశవులు (20) అని వివరించారు. వీరిలో మహ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు లారీ డ్రైవర్లు కాగా, మిగతా ఇద్దరూ క్లీనర్లని, వీళ్లు తెలంగాణతో పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాలకు లారీల ద్వారా మెటీరియల్ తరలిస్తుంటారని తెలిపారు. అదే క్రమంలో ఇతర ప్రాంతం నుంచి లోడుతో టోల్ ప్లాజా వద్దకు చేరుకున్నారని, లారీని ఎక్కడ అన్ లోడ్ చేయాలన్న దానిపై అవతలి పార్టీ నుంచి ఫోన్ రాకపోవడంతో టోల్ ప్లాజా సమీపంలోనే తమ వాహనాన్ని నిలిపి ఉంచారని సజ్జనార్ వివరించారు.

సాయంత్రం ఆరు గంటల సమయంలో ప్రియాంక రెడ్డి అక్కడ తన స్కూటీని పార్క్ చేయడం చూశారని, అప్పటికే వారందరూ మద్యం సేవించి ఉన్నారని తెలిపారు.

"ఆమె తన స్కూటీ అక్కడే పార్క్ చేసి ఓ ట్రీట్ మెంట్ కోసం గచ్చీబౌలి వెళ్లింది. ఆమె మళ్లీ అక్కడికి వస్తుందని అంచనా వేసి కిరాతక ఆలోచనకు తెరలేపారు. నవీన్ అనే యువకుడు ఆమె స్కూటీ వెనుక టైరు గాలి తీసేశాడు. ఆమె మళ్లీ అక్కడికి చేరుకోగానే మీ టైరు పంక్చరైందని, మీకు సాయం చేస్తామని చెప్పడంతో నిజమని నమ్మేసింది. ఆ స్కూటీని తీసుకెళ్లిన శివ కాసేపటి తర్వాత వచ్చి పంక్చర్ షాపు మూసివేసి ఉందని చెప్పాడు. మరోషాపుకు వెళ్లి గాలి కొట్టుకుని వచ్చారు.

ఇంతలో ప్రియాంకను మహ్మద్ ఆరిఫ్ లారీల చాటుకు లాక్కెళ్లాడు. అతడికి మిగతా వాళ్లు కూడా సహకరించారు. ఆ తర్వాత అందరూ కలిసి ఆమెపై అత్యాచారం చేశారు. ఆమె అరుపులు వినిపించకుండా బలంగా నోరు నొక్కేశారు. దాంతో ఊపిరాడక ప్రియాంక చనిపోయింది. అనంతరం ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్ తీసుకున్నారు. ప్రియాంక మృతదేహాన్ని ఓ దుప్పట్లో చుట్టేసి షాద్ నగర్ వద్ద పెట్రోల్ పోసి తగులబెట్టేశారు. మళ్లీ ఓసారి వచ్చి మృతదేహం పూర్తిగా కాలిందో లేదో పరిశీలించారు. ఆమె స్కూటీని మార్గమధ్యంలోనే పడేశారు.

ఆ తర్వాత మహ్మద్ ఆరిఫ్ లారీతో సహా వెళ్లి అందులోని మెటీరియల్ అన్ లోడ్ చేశాడు. ఆ తర్వాత అందరూ వెళ్లిపోయారు. ఈ కేసు దర్యాప్తు మొదలుపెట్టాక సీసీ కెమెరా ఫుటేజ్ ఎంతో కీలకంగా మారింది. ఎంతో కష్టమ్మీద నిందితులందరినీ గుర్తించి అరెస్ట్ చేయగలిగాం" అంటూ ఘటన పూర్వాపరాలను సజ్జనార్ వివరించారు.

More Telugu News