Jnanapith Award winner: కేరళ కవి అక్కితం అచ్యుతన్ కు ‘జ్ఞానపీఠ్ పురస్కారం’

  • ఇప్పటివరకు 43 అద్భుత రచనలతో ఆకట్టుకున్న అక్కితం
  • ఆయన రచనల్లో పేరెన్నిక గలది ‘నూటందింతే ఇతిహాసం’
  • ఈ విశిష్ట పురస్కారాన్ని అందుకున్న కేరళ కవుల్లో అక్కితం ఆరవ వ్యక్తి

ప్రముఖ మలయాళీ కవి అక్కితం అచ్యుతన్ నంబూద్రి ఈ ఏడాది జ్ఞానపీఠ్ అవార్డును సొంతం చేసుకున్నారు. కేరళ సాహిత్య రంగంలో ఆయన విశేష కృషిని గుర్తించిన 55వ జ్ఞానపీఠ్ అవార్డుల కమిటీ ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారమైన ఈ అవార్డును పొందిన 93 ఏళ్ల అక్కితం ఇప్పటివరకు 43కు పైగా రచనలు చేశారు. ప్రస్తుతం ఆయన పాలక్కడ్ లో నివసిస్తున్నారు.

మలయాళీ సాహిత్యంలో ఆయన సేవలకు గాను కేంద్రం 2017లో పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. అంతేకాక, గతంలో కేంద్ర, రాష్ట్ర సాహిత్య అకాడెమీ అవార్డులను కూడా ఆయన పొందారు. ఆయన రచనల్లో ప్రముఖమైనది ‘నూటందింతే ఇతిహాసం’. కాగా, ఆ ఇతిహాసంలో రాసిన ‘వెలుగు దు:ఖాన్ని మిగిలిస్తే.. చీకటి సంతోషాన్ని పంచుతుంది’ అన్నవాక్యం ప్రజల మనసులను మీటింది. గతంలో కేరళ నుంచి  జ్ఞానపీఠ్ అవార్డును పొందిన వారిలో  జి శంకర కురూప్(1965), ఎస్కే పొట్టక్కడ్(1980), తకజి శివశంకర పిళ్లై(1984), ఎంటీ వాసుదేవన్ నాయర్(1995), ఓఎన్వీ కురూప్(2007) ఉన్నారు.

More Telugu News