Andhra Pradesh: అమరావతి అంశాన్ని రాజ్యసభలో ప్రస్తావించిన టీడీపీ సభ్యుడు కనకమేడల

  • రాజ్యసభలో అమరావతిపై మాట్లాడిన కనకమేడల
  • అమరావతి నిర్మాణ పూర్వాపరాలను సభకు వివరించిన నేత
  • రాష్ట్రాన్ని ఆదేశించాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి

టీడీపీ నేత కనకమేడల రవీంద్రకుమార్ ఇవాళ రాజ్యసభలో ఏపీ రాజధాని అమరావతి అంశాన్ని లేవనెత్తారు. ఏపీ రాజధాని కోసం కేంద్రం 2014లోనే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ తన నివేదికను కేంద్రానికి సమర్పించిందని తెలియజేశారు. కమిటీ నివేదిక, ఇతర అంశాల ఆధారంగా అమరావతిలో రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి ఓ నివేదిక సమర్పించిందని కనకమేడల పేర్కొన్నారు. 2015 అక్టోబరు 22న ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేశారని వెల్లడించారు.

రాజధాని నిర్మాణం కోసం అమరావతి ప్రాంత రైతులు 33 వేల ఎకరాల భూమిని ఇచ్చారని సభకు తెలియజేశారు. 29 గ్రామాల ప్రజలు ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చారని, రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని, భూములు ఇవ్వడంపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని తెలిపారు. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టుతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటయ్యాయని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణంలో భాగంగా రూ.24 వేల కోట్ల విలువైన పనులు ప్రారంభం అయ్యాయని, కానీ 2019లో కొత్త ప్రభుత్వం రావడంతో రాజధానిలో నిర్మాణ పనులను అర్థాంతరంగా ఆపేశారని ఆరోపించారు.

ప్రభుత్వ నిర్ణయంతో 28 వేల మంది రైతుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయని అన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం రూ.1500 కోట్లు విడుదల చేసిందని, ఢిల్లీ కంటే ఎక్కువ నిధులు ఇస్తామని ప్రధాని చెప్పారని కనకమేడల గుర్తుచేశారు. చంద్రబాబు చొరవచూపడంతో మౌలిక సదుపాయాల రూపకల్పన జరిగిందని తెలిపారు. కానీ రాజధాని పనులు ఆగిపోవడంతో 6 కోట్ల ఆంధ్రుల జీవితాలు అయోమయంలో పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

తాజా పరిణామాల నేపథ్యంలో సింగపూర్ ప్రాజెక్టు కూడా వెనక్కి వెళ్లిపోయిందని, అమరావతి పనులు కొనసాగేలా కేంద్రం ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఏపీ రాజధాని విషయంలో కేంద్రం ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. 

More Telugu News