Anantapur District: 'ప్రేమలేఖ రాశా నీకంది ఉంటది'...ఉపాధ్యాయుని ప్రేమ పాఠాలు

  • ప్రేమిస్తున్నానంటూ శిష్యురాలికి వరుస లేఖలు 
  • కలలో కూడా నువ్వే అంటూ విరహ వేదన
  • విషయం తెలిసి ఆగ్రహెూదగ్రులైన గ్రామస్థులు

తల్లిదండ్రుల స్థానాన్ని గురువుకు కట్టబెట్టింది ఈ సమాజం. అంతటి ఉన్నత స్థానంలో ఉన్నా తనలోని లేకితనాన్ని, పాడు బుద్ధిని ప్రదర్శించుకున్నాడో గురువు. శిష్యురాలితో ప్రేమ బాసలు చేయడం మొదలు పెట్టాడు. అక్కడితో ఆగకుండా ఉత్తరం కూడా రాయడంతో విషయం కాస్తా వివాదమయింది. 


వివరాల్లోకి వెళితే... అనంతపురం జిల్లా రామగిరి మండలం నసనకోటలో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో ఐదు నుంచి తొమ్మిదో తరగతి బాలికలు చదువుతున్నారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు పాఠశాలలో చదువుతున్న ఒక బాలికపై కన్నేశాడు. ప్రేమ పేరుతో ఆమెను ముగ్గులోకి దింపి తరచూ ప్రేమపాఠాలు వల్లించడం మొదలు పెట్టాడు.


తోటి విద్యార్థులు దీన్ని గమనించి ఉపాధ్యాయుల దృష్టికి తీసుకువెళ్లడంతో సదరు ఉపాధ్యాయుడిని వారు మందలించారు. అయినా అతనిలో మార్పురాలేదు సరికదా తరచూ ప్రేమ లేఖలు రాస్తున్నట్లు గుర్తించారు.


'నీవు ఒకసారి అవునంటావు. మరోసారి కాదంటావు. నేను మాత్రం ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తున్నా. నువ్వు కాదన్నప్పుడల్లా అన్నం కూడా తినబుద్ధి కావడం లేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. అందుకే నిన్ను వదులుకోలేకపోతున్నా. నన్ను ప్రేమిస్తున్నానని ఒక్కమాట చెప్పు. అప్పుడు నేను ఎలావుంటానో నువ్వే చూద్దువుగాని. నువ్వు ఆల్వేజ్ మై స్వీట్ హర్ట్' అంటూ ఆ లేఖల్లో తన విరహ వేదనను వెల్లడిస్తున్నాడు.

విషయం కాస్తా నాలుగు రోజుల క్రితం గ్రామస్థుల దృష్టికి వెళ్లడంతో వారు పాఠశాల సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. సదరు ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం పై స్కూల్ ప్రిన్సిపాల్ సంగీతకుమారి వివరణ ఇస్తూ 'వివాదం వాస్తవమే... మూడు రోజుల క్రితమే సదరు ఉపాధ్యాయుడిని విధుల నుంచి తప్పించి పంపించేశాం' అని తెలిపారు.

More Telugu News