hawkeye app: హ్యాక్-ఐని ఆశ్రయించి ఉంటే ప్రియాంక బతికేదా?

  • పోలీసుల అధికారిక యాప్ హ్యాక్ఐ
  • లక్షల్లో డౌన్‌లోడ్‌లు.. వందల్లో ఉపయోగం
  • ప్రాణాలు తీసిన అవగాహన లేమి

సంచలనం సృష్టించిన ప్రియాంకరెడ్డి హత్యకేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని జేపీ దర్గా వద్ద పడి ఉన్న ఆమె స్కూటీని పోలీసులు గుర్తించారు. కాగా, తాను ప్రాణాలతో బయటపడే అవకాశం ఉన్నప్పటికీ ప్రియాంక భయం కారణంగా సరిగా ఆలోచించలేకపోయిందని తెలుస్తోంది. ఫలితంగా కామాంధుల చేతిలో బలైపోయిందని అంటున్నారు. తనకు భయంగా ఉందని తన సోదరికి ఫోన్ చేసిన ప్రియాంక.. అదే సమయంలో పోలీసు కంట్రోలు రూం నంబరు 100కు కాల్ చేస్తే ఫలితం ఉండేదని చెబుతున్నారు.

తన స్కూటీకి పంక్చరు కావడంతో రోడ్డుపై ఒంటరిగా మిగిలిన ప్రియాంక పోలీసు కంట్రోలు రూం నంబరు 100 కానీ, పోలీసుల అధికారిక యాప్ హ్యాక్ఐని కానీ సంప్రదించి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హ్యాక్ఐపై అవగాహన లేకపోవడమే ఇందుకు కారణం కావచ్చని చెబుతున్నారు. ఈ యాప్‌ను ఇప్పటి వరకు లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. అయితే, వాడుతున్నది మాత్రం వందల్లోనే.

హ్యాక్ఐలో ఉన్న ఎస్‌ఓఎస్‌లో ముందు రిజిస్టర్‌ చేసుకోవాలి. ప్రమాదం పొంచి ఉన్నట్టు అనిపిస్తే ‘ఎస్‌ఓఎస్‌’ను నొక్కితే పోలీసులు వెంటనే బాధితురాలున్న ప్రదేశానికి చేరుకుని రక్షిస్తారు. ఈ యాప్‌లో రిజిస్టర్ అయ్యాక మనం వెళ్లాల్సిన ప్రదేశం, దిగాల్సిన ప్రదేశాన్ని ఫీడ్ చేసి వాహనం నంబరు ఎంటర్ చేస్తే సరిపోతుంది. జీపీఎస్ కారణంగా వాహనం పోలీసుల పర్యవేక్షణలో ఉంటుంది. ఒకవేళ వెళ్లాల్సిన మార్గంలో కాకుండా వేరే రూట్‌లోకి వెళ్తే పోలీసులే అప్రమత్తమై ప్రయాణికురాలిని సంప్రదిస్తారు. స్పందన రాకుంటే వారే స్వయంగా రంగంలోకి దిగుతారు. ప్రయాణికురాలు సురక్షితంగా గమ్యం చేరే వరకు ఈ యాప్ ద్వారా పోలీసుల పర్యవేక్షణ కొనసాగుతుంది.

ఈ యాప్ గురించి ప్రియాంకకు తెలియకపోవడమే, లేదంటే భయం కారణంగా ఆలోచనలు రాకపోవడం వల్లో ప్రియాంక 100 నంబరుకు ఫోన్ చేయలేకపోయింది. దీంతో నిందితులకు చిక్కింది. కాగా, హ్యాక్ ఐతోపాటు పోలీసులు  డయల్‌ ‘100’, 9490616555-హైదరాబాద్, 9490617444-సైబరాబాద్, 9490617111-రాచకొండ వాట్సాప్‌ నంబర్లలోనూ పోలీసులను ఆశ్రయించవచ్చు.

More Telugu News