Telangana: అశ్వత్థామ కార్మికులను బలిపశువులను చేశారు: టీజేఎంయూ నేత హనుమంతు విమర్శ

  • ఆయన అసమర్థత వల్లే ఆర్టీసీలో సమస్యలు పేరుకుపోయాయి
  • సమ్మె కారణంగా మరణించిన కార్మికుల కుటుంబాలను ఎవరు ఆదుకుంటారు?
  • ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమించినప్పటికీ జేఏసీ-1 సమ్మె కొనసాగుతుంది 

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు బేషరతుగా సమ్మె విరమిస్తారని, జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి చేసిన ప్రకటనపై ఇతర కార్మిక నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు కార్మికులను సమ్మెబాట పట్టించిన అశ్వత్థామ రెడ్డి, తన ప్రకటనతో కార్మికులను బలి పశువులను చేశారని టీజేఎంయూ ప్రధాన కార్యదర్శి హనుమంతు విమర్శించారు.  

సమ్మె కారణంగా ఇప్పటివరకు 29 మంది కార్మికులు మరణించారని ఆయన పేర్కొన్నారు. సమ్మె కాలంలో పలు డిపోల పరిధిలో చాలా మంది కార్మికులపై కేసులు కూడా నమోదయ్యాయన్నారు. వాటిపై ఏం మాట్లాడకుండా సమ్మె విరమణ ప్రకటన ఎలా చేస్తారని ప్రశ్నించారు. సమ్మె విరమించాలని సీఎం కోరి, అవకాశమిచ్చినప్పుడు విరమించి వుంటే కనుక బాగుండేదని చెప్పుకొచ్చారు. కార్మికుల జీవితాలతో అశ్వత్థామ ఆడుకున్నారని ఆరోపించారు. ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమించినప్పటికీ.. జేఏసీ-1 సమ్మె విరమించదని ఆయన స్పష్టం చేశారు.

More Telugu News