Chandrababu: మా కృషిని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించి మత్స్యకారులను ఆదుకోవాలి: చంద్రబాబు డిమాండ్

  • మా హయాంలో మత్స్యరంగంలో ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలిపాం
  • మత్స్యకారులను ఎస్టీల్లో చేర్చాలి
  • మత్స్యకారుల గృహనిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలి
  • ఆదరణ పథకాన్ని పునరుద్ధరించాలి

ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకార సోదరులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తమ హయాంలో మత్స్యరంగంలో ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే అగ్రగామిగా నిలిపామని చెప్పుకొచ్చారు. మత్స్యరంగ అభివృద్ధితో పాటు మత్స్యకారులలో పేదరిక నిర్మూలనకు సైతం ఎంతో కృషి చేశామని ట్వీట్ చేశారు.
 
50 ఏళ్లకే పింఛన్లను ఇచ్చి వారిలో భరోసా పెంచామని చంద్రబాబు చెప్పారు. వేట నిషేధ కాలంలో పరిహారం రెండు రెట్లు చేశామని, మహిళా మత్స్య గ్రూపులకు సహాయం 4 రెట్లు చేశామని తెలిపారు. వేటకెళ్లి తిరిగిరాని మత్స్యకారుల కుటుంబాలకు పరిహారం 2 రెట్లు చేశామని, మత్స్యకారుల సంక్షేమానికి భారీగా బడ్జెట్ పెంచామని చెప్పారు.
 
వారికి ఇళ్ల పట్టాలిచ్చామని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించామని చంద్రబాబు చెప్పారు. మత్స్యకారులకు అండగా ఆదరణ పథకాన్ని తెచ్చామని, అందుకే ఎల్లప్పుడూ మత్స్యకారులే టీడీపీకి వెన్నెముకగా నిలిచారని తెలిపారు. తమను ఎస్టీల్లో చేర్చాలన్న మత్స్యకారుల డిమాండ్ ను నెరవేర్చే కృషి చేశామని అన్నారు. తమ కృషిని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించి మత్స్యకారులను ఎస్టీల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. మత్స్యకారుల గృహనిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని, ఆదరణ పథకాన్ని పునరుద్ధరించాలని అన్నారు.

More Telugu News