YSRCP: మన ఉనికి కాపాడుకోవడానికి ‘తెలుగు’..కెరీర్ కోసం ‘ఇంగ్లీషు’ అవసరం: చంద్రబాబునాయుడు

  • ఆంగ్ల మీడియంలో బోధనకు మేము వ్యతిరేకం కాదు
  • ఒక పద్ధతి ప్రకారం వెళ్లమని చెబితే విమర్శిస్తారా?
  • నాడు టీడీపీ చొరవ వల్లే పేదపిల్లలకు మంచి ఉద్యోగాలు వచ్చాయి

ఆంగ్ల మీడియంలో బోధనకు తాము వ్యతిరేకం కాదని ఇప్పటికే స్పష్టం చేశామని, అయితే, మన సంప్రదాయాలు, ఉనికి కాపాడుకోవడానికి ‘తెలుగు’, కెరీర్ కోసం ‘ఇంగ్లీషు’ అవసరమని చెబుతున్నామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నియోజకవర్గ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘ఇంగ్లీషు’ను వ్యతిరేకించడం లేదు, ఒక పద్ధతి ప్రకారం వెళ్లమని ప్రభుత్వానికి చెబుతుంటే మాపై విమర్శలు చేస్తారా? అని ప్రశ్నించారు.

 ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంను వైసీపీ ప్రభుత్వమే కొత్తగా ప్రవేశపెడుతున్నట్టు, గతంలో ఇక్కడి పేదలకు ఉద్యోగాలు రానట్టుగా చెబుతోందని విమర్శించారు. ఈరోజున మన రాష్ట్రానికి చెందిన పేద పిల్లలకు, మధ్యతరగతి పిల్లలకు ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాలు రావడానికి కారణం నాడు టీడీపీ చూపించిన చొరవే అని అన్నారు. దీని వల్ల ఆంధ్రప్రదేశ్ పిల్లలు అమెరికాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వున్నారని, ముందుకెళ్లారని చెప్పారు. టీడీపీ హయాంలో ఇంగ్లీషు మీడియం విద్యను పైలట్ ప్రాజెక్టు కింద ప్రవేశపెట్టామని గుర్తుచేశారు.

More Telugu News