vemulavada MLA Chennamaneni Ramesh citizenship: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వం రద్దు.. కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు!

  • మోసపూరితంగా పౌరసత్వాన్ని పొందాడని పిటిషన్ వేసిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్
  • నిబంధనల ప్రకారం దేశంలో 365 రోజులు నివసించలేదని ఫిర్యాదు
  • విచారణ జరిపి నిర్ణయం ప్రకటించిన హోంశాఖ 

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ కు కేంద్ర హోం శాఖ వద్ద చుక్కెదురైంది. ఆయన భారత పౌరసత్వానికి అనర్హుడంటూ కేంద్ర హోం శాఖ ప్రకటించింది. ఆయన మోసపూరితంగా భారత పౌరసత్వం పొందారని నిర్ధారణ అయిందని హోం శాఖ పేర్కొంది. చెన్నమనేనిపై కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ హోంశాఖకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హోం మంత్రిత్వ శాఖ విచారణ జరిపింది. చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.

2009 అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా రమేశ్ విజయం సాధించారు. అప్పుడు ఆయన పౌరసత్వంపై వివాదం చెలరేగింది. రమేశ్ తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పౌరసత్వం పొందాడని ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేశారు. ఆయన జర్మనీలో ఉంటున్నాడని ఆయనకు భారత పౌరసత్వం ఇవ్వకూడదని పేర్కొన్నారు.  2010 సంవత్సరంలో హైకోర్టులో ఆయన కేసు వేశారు. నిజానికి చెన్నమనేని రమేశ్ 1993 లో జర్మనీ పౌరసత్వం పొందారు. అప్పుడే ఆయన భారత పౌరసత్వం రద్దు చేసుకున్నారు. అనంతరం 2008లో తిరిగి భారత పౌరసత్వంకోసం దరఖాస్తు చేసుకున్నారు.

నిబంధనల ప్రకారం దేశంలో 365 రోజులు నివసించాలని, అప్పుడే పౌరసత్వం పొందే వీలవుతుందని శ్రీనివాస్ వాదించారు. దీనిపై విచారణ జరిపిన హోం శాఖ రమేశ్ పౌరసత్వం చెల్లదని ప్రకటించింది. కాగా, 2010 ఉప ఎన్నికల్లో, 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా రమేశ్ గెలుపొందారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలిచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

More Telugu News