jac: టీఎస్సార్టీసీ జేఏసీ నేతల దీక్ష విరమణ

  • వైద్యుల సూచన మేరకు దీక్ష విరమింపజేసిన అఖిలపక్ష నేతలు
  • నిమ్మరసం ఇచ్చిన మంద కృష్ణ మాదిగ
  • సమ్మెపై తుది నిర్ణయాన్ని రేపు సాయంత్రం ప్రకటిస్తామన్న అశ్వత్థామరెడ్డి

టీఎస్సార్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి తమ దీక్షను విరమించారు. వైద్యుల సూచన మేరకు అఖిలపక్ష నేతలు వారితో దీక్ష విరమింపజేశారు. ఉస్మానియా ఆసుపత్రిలో దీక్ష చేస్తున్న అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డికి ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అనంతరం మీడియాతో అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ, సమ్మె యథాతథంగా కొనసాగుతుందని చెప్పారు. అయితే, సడక్ బంద్, రాస్తారోకోలను మాత్రం వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. జడ్జిమెంట్ కాపీ చూశాక సమ్మెపై తుది నిర్ణయం రేపు సాయంత్రం ప్రకటిస్తామని అన్నారు.
 
అంతకుముందు, ఉస్మానియా ఆస్పత్రిలో ఉన్న ఆర్టీసీ జేఏసీ నాయకులను అఖిలపక్షం నేతలు పరామర్శించారు. అనంతరం మీడియాతో తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ, ప్రభుత్వం వెంటనే మానవతా దృక్పథంతో చర్చలు జరపాలని కోరారు. టీటీడీపీ నేత ఎల్. రమణ, వామపక్ష నేత చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, జేఏసీ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. ఆర్టీసీని ప్రైవేటు పరంచేయాలని చూస్తున్నారని, ఆర్టీసీ కార్మికులను బజారుపాలు చేస్తున్నారని మండిపడ్డారు.

More Telugu News