Students Going to Study in America: అమెరికా బాట పట్టిన విద్యార్థుల్లో చైనా టాప్

  • రెండో స్థానంలో భారత్
  • విదేశీ విద్యార్థుల మూలంగా అమెరికాకు 44.7 బిలియన్ డాలర్ల ఆదాయం
  • ఓపెన్ డోర్స్ రిపోర్ట్ ఆన్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ ఎక్చేంజ్ నివేదికలో వెల్లడి

అమెరికాలో విద్యాభ్యాసానికి వెళుతున్నవారిలో చైనా విద్యార్థులే అత్యధికంగా ఉన్నారని తాజా నివేదికలో వెల్లడైంది. రెండో స్థానం లో భారత్ ఉంది. మరోవైపు  విదేశీ విద్యార్థుల మూలంగా  అమెరికాకు 2018లో 44.7 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చిందని తెలుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఆదాయంలో 5.5శాతం వృద్ధి నమోదు అయింది. అమెరికాకు వెళుతున్న విద్యార్థుల్లో 21.1 శాతం మంది ఇంజినీరింగ్ విద్యను కోరుకుంటున్నారని నివేదిక వెల్లడించింది. కాగా, మ్యాథ్స్, కంప్యూటర్ విద్య చదువుతున్న వారి సంఖ్య 9.4 శాతం పెరిగింది. తర్వాతి స్థానంలో ఎంబీఏ విద్య నభ్యసిస్తున్న విద్యార్థులు ఉన్నారు.

2019 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘ఓపెన్ డోర్స్ రిపోర్ట్ ఆన్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ ఎక్చేంజ్’ ప్రపంచ దేశాలనుంచి అమెరికాలోకి వచ్చే విద్యార్థులకు సంబంధించి గణాంకాలతో కూడిన నివేదికను వెలువరించింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 10 లక్షల మందికి పైగా విదేశీ విద్యార్థులు అమెరికాకు వెళ్లారని తెలుస్తోంది. వీరిలో 3.69 లక్షల మంది విద్యార్థులు చైనాకు చెందినవారు కాగా, భారత్ నుంచి 2,02,014 మంది విద్యార్థులు ఉన్నారని నివేదిక పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే.. అమెరికాకు వెళ్లిన చైనా విద్యార్థుల సంఖ్య 1.7 శాతం పెరుగగా, భారత విద్యార్థుల సంఖ్య 2.9 శాతం పెరిగిందని వెల్లడైంది. బంగ్లాదేశ్, బ్రెజిల్, నైజీరియా, పాకిస్థాన్ నుంచి విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని నివేదిక తెలిపింది.

More Telugu News