Jagan: జగన్ ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి సూసైడ్ ఆంధ్రప్రదేశ్ గా మారింది: నారా లోకేశ్

  • టీడీపీ సానుభూతిపరులను వెలివేస్తున్నారు
  • జగన్  సైకో ఇజంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తోంది
  • ఇప్పటికే 610 మంది టీడీపీ కార్యకర్తలపై దాడులు చేశారు

టీడీపీ సానుభూతిపరులను గ్రామాల నుంచి వెలివేస్తున్నారని వైసీపీపై తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డ టీడీపీ కార్యకర్త కార్తీక్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.

 అనంతరం, ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్రానికి 'ఒక్క ఛాన్స్' ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ సూసైడ్ ఆంధ్రప్రదేశ్ గా మారిందని విమర్శించారు. ఇప్పటికి రెండు వందల నలభై మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, 8 మంది టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి చంపారని ఆరోపించారు. వైసీపీ నాయకుల ఒత్తిడి తట్టుకోలేక ఇద్దరు అధికారులు కూడా ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. భవన నిర్మాణ కార్మికులు అయితే ఇప్పటికే 43 మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు.

2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయినప్పుడు 250 మంది టీడీపీ కార్యకర్తలను చంపించారని ఆరోపించారు. ఆరోజున ఫ్యాక్షనిజం చూశాం, ఈరోజున ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి సైకో ఇజంతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని దుమ్మెత్తిపోశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి 610 మంది టీడీపీ కార్యకర్తలపై దాడులు చేశారని, కార్యకర్తలపైనే కాదు టీడీపీకి ఎవరైతే ఓటు వేశారో, సానుభూతిపరులు ఎవరైతే ఉన్నారో వారినీ ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.

More Telugu News