China: ఆన్ లైన్ లో ఆహారాన్ని ఆర్డర్ చేసేసుకున్న కోతి... వైరల్ అవుతున్న సీసీటీవీ ఫుటేజ్!

  • చైనాలోని యాంజెంగ్ లో ఘటన
  • సెల్ ఫోన్ మరచి వెళ్లిన కోతి సంరక్షకురాలు
  • ఆపై వచ్చి చూసేవరకూ ఆర్డర్ కన్ఫర్మ్

కోతులకు తెలివితేటలు అధికంగా ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ, ఈ కోతికి ఇంకాస్త ఎక్కువగానే తెలివితేటలు ఉన్నాయి. తన చేతికి చిక్కిన స్మార్ట్ ఫోన్ ను తీసుకుని, ఏకంగా ఆన్ లైన్ లో షాపింగ్ చేసేసింది. ఈ ఘటన చైనాలోని యాంజెంగ్ వైల్డ్ ఎనిమల్ వరల్డ్ లో జరిగింది. ఇప్పుడా కోతి ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్న సీసీటీవీ ఫుటేజ్ వీడియో ఇంటర్నెట్ ప్రపంచంలో తెగ చక్కర్లు కొడుతోంది.

అసలు ఏం జరిగిందంటే, ఈ కోతి యోగక్షేమాలను మెంగ్ మెంగ్ అనే యువతి చూస్తుంటుంది. నిన్న మధ్యాహ్నం ఆమె కొన్ని నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలని కాసేపు ఆన్ లైన్ లో వెతికింది. అదే సమయంలో కోతికి ఆహారం తీసుకురావడానికి బయటకు వెళ్లాల్సి రాగా, ఫోన్ ను అక్కడే వదిలేసి వెళ్లింది. ఆమె వెనక్కు తిరిగి వచ్చేసరికి మొబైల్ కు ఆర్డర్ కన్ఫర్మ్ అయినట్టు సమాచారం వచ్చింది. దీంతో షాక్ నకు గురైన ఆమె, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించగా, మర్కట నిర్వాకం బయటపడింది. ఆ వీడియోను ఆమె సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది. దాన్ని మీరూ చూసేయండి.

More Telugu News