Laxman: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు.. మా పార్టీలోకి వలసలు భారీగా పెరిగాయి: లక్ష్మణ్

  • అడ్డదారుల్లో అధికారంలోకి రావాలనే ఆలోచన మాకు లేదు
  • తెలంగాణలో అధికారంలోకి రావడమే మా లక్ష్యం
  • ఉద్దేశపూర్వకంగానే ఆర్టీసీని ప్రభుత్వం నష్టాలపాలు చేసింది

ఇటీవలి కాలంలో వివిధ పార్టీల నుంచి బీజేపీలోకి వలసలు భారీగా పెరిగిపోయాయని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్ లో ఉన్నారని... అయితే, అడ్డదారుల్లో అధికారంలోకి రావాలనే ఆలోచన తమకు లేదని చెప్పారు. గతంలో తెలంగాణ ఉద్యమం సెంటిమెంట్ తో టీఆర్ఎస్, తెలుగువారి ఆత్మాభిమానం పేరుతో టీడీపీ విస్తరించాయని... ఇప్పుడు ఏపీ, తెలంగాణల్లో బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని చెప్పారు.

తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలను నిర్మిస్తామని లక్ష్మణ్ తెలిపారు. నంద్యాల ఉపఎన్నికలో టీడీపీ గెలిచిన విధంగానే... హూజూర్ నగర్ ఉపఎన్నికలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ గెలుపొందుతుందని తాను ముందే చెప్పానని అన్నారు. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ అనే అంశంపై చర్చ జరగడం మంచిదేనని తెలిపారు. బీఆర్ అంబేద్కర్ కూడా రెండో రాజధానిగా హైదరాబాదును ప్రతిపాదించారని గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కొనేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని అన్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాల్లో కుంభకోణాలు ఉన్నాయని లక్ష్మణ్ ఆరోపించారు. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి టీఆర్ఎస్ ను దోషిగా నిలబెడతామని చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే ఆర్టీసీని ప్రభుత్వం నష్టాలపాలు చేసిందని విమర్శించారు. తెలంగాణలో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని చెప్పారు. జాతీయ స్థాయిలో తన సేవలు అవసరమనుకుంటే హైకమాండ్ తనను ఢిల్లీకి పంపుతుందని తెలిపారు.

More Telugu News