Kirthi reddy: పోలీసు కస్టడీకి కీర్తి.. ఇంతవరకు కూతుర్ని కలవని తండ్రి!

  • ములాఖత్ లో కలిసింది మేనత్త, మేనమామ మాత్రమే
  • ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కేసులో నిందితురాలు
  • ఐదు రోజుల పోలీసుల కస్టడీకి అనుమతినిచ్చిన కోర్టు

భార్య మరణం కుంగదీసిందో, కుమార్తె కారణంగా ఎదురైన షాక్ నుంచి అతను ఇంకా తేరుకోలేదోగాని హైదరాబాద్ హయత్ నగర్ పరిధి మునగనూరుకు చెందిన కీర్తిరెడ్డి తండ్రి శ్రీనివాసరెడ్డి కూతురివైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఆస్తి కోసం ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కేసులో కీర్తి నిందితురాలన్న విషయం తెలిసిందే.


తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో కీర్తిని అరెస్టు చేసిన పోలీసులు ఆమెను చంచల్‌గూడ సెంట్రల్‌ జైలుకు తరలించారు. ఇన్ని రోజులైనా శ్రీనివాసరెడ్డి తన కూతురిని కలిసే ప్రయత్నం కూడా చేయలేదు. జైల్లో ఉన్న కీర్తిని ఆమె మేనత్త, మేనమామలు మాత్రం ఒకసారి ములాఖత్ లో కలిసారు.


కాగా, తాజాగా కీర్తి రెడ్డిని పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు అనుమతినిచ్చింది. ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించడంతోపాటు పలు అంశాలు విశ్లేషించాల్సిన అవసరం ఉన్న దృష్ట్యా కీర్తిని తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టును కోరారు. దీంతో ఐదురోజుల కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. రోజూ ఉదయం ఆమెను చంచల్ గూడ జైలు నుంచి తీసుకువెళ్లి, విచారణ పూర్తి కాగానే సాయంత్రం తిరిగి జైలుకు అప్పగించాలని నిబంధన విధించింది.


కోర్టు ఆదేశాల మేరకు నిన్న ఉదయం పోలీసులు కీర్తి రెడ్డిని భద్రత నడుమ హయత్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి, విచారణ అనంతరం సాయంత్రం జైలుకు అప్పగించారు. రోజంతా కూతురు పోలీస్ స్టేషన్లోనే ఉన్నా ఆమెను పలకరించే ప్రయత్నం కూడా శ్రీనివాసరెడ్డి చేయలేదు.  

More Telugu News