Jammu And Kashmir: జమ్మూకశ్మీర్ లో క్రికెట్ అభివృద్ధికి గంగూలీ భరోసా

  • ఇటీవలే బీసీసీఐ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన గంగూలీ
  • గంగూలీతో భేటీ అయిన పర్వేజ్ రసూల్, ఇర్ఫాన్ పఠాన్
  • కశ్మీర్ లో క్రికెట్ గురించి చర్చ

భారత్ లో అంతర్భాగంగానే ఉన్నా, జమ్మూకశ్మీర్ కు ఇతర రాష్ట్రాలతో సంబంధాలు అంతంతమాత్రమే. ఆర్టికల్ 370 ఎత్తివేశాక ఆ పరిస్థితిలో మార్పు వస్తుందని కేంద్రం విశ్వసిస్తోంది. రాజకీయ, వాణిజ్య సంబంధాలు కాదు క్రీడల్లోనూ జమ్మూకశ్మీర్ నుంచి జాతీయస్థాయిలో సరైన ప్రాతినిధ్యం లేదు. అయితే, బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ బాధ్యతలు స్వీకరించడంతో జమ్మూకశ్మీర్ క్రికెట్ సంఘంలో కొత్త ఆశలు చిగురించాయి. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్ రంజీ కెప్టెన్ పర్వేజ్ రసూల్, సలహాదారు ఇర్ఫాన్ పఠాన్, క్రికెట్ సంఘం అధికారి బీసీసీఐ చీఫ్ గంగూలీని ముంబయిలో కలిశారు.

ఈ ముగ్గురితో చాలాసేపు భేటీ అయిన గంగూలీ జమ్మూకశ్మీర్ లో క్రికెట్ అభివృద్ధికి సంపూర్ణ హామీ ఇచ్చారు. జమ్మూకశ్మీర్ లో క్రికెట్ సదుపాయాలు మెరుగుపర్చడమే కాకుండా, అక్కడి లీగ్ క్రికెట్ పురోగతికి తోడ్పాటు అందిస్తామని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ జట్టు సూరత్ లో సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాళీ టోర్నీలో ఆడుతోంది.

More Telugu News