Vijaya Reddy: లంచం కోసం వేధించినందుకే విజయారెడ్డిని నా భర్త హత్య చేశాడు: నిందితుడు సురేశ్ భార్య

  • రెండు నెలల తర్వాత ఇస్తానని నా భర్త చెప్పినా విజయారెడ్డి వినలేదు
  • రెండు నెలలుగా మానసిక వేదన అనుభవించాడు
  • రాత్రి వేళల్లో కూడా ఏడ్చేవాడు

హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని సురేశ్ అనే వ్యక్తి సజీవదహనం చేసిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటనలో విజయారెడ్డి డ్రైవర్ తో పాటు, సురేశ్ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. మరోవైపు, విజయారెడ్డిపై సురేశ్ భార్య లత సంచలన వ్యాఖ్యలు చేశారు. లంచం కోసం వేధించడం వల్లే విజయారెడ్డిని తన భర్త సజీవదహనం చేశాడని తెలిపారు. భూమి పట్టా కోసం విజయారెడ్డి లంచం అడిగారని... నెల తర్వాత ఇస్తానని చెప్పినా ఆమె వినలేదని అన్నారు.

ఇల్లు అమ్మి డబ్బులు ఇస్తానని చెప్పినా విజయారెడ్డి అంగీకరించలేదని లత తెలిపారు. భూమి, కోర్టు కేసులతో తన భర్త అప్పులపాలయ్యాడని... కోర్టు కేసుల కోసం మా అత్త బంగారాన్ని కూడా తాకట్టుపెట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలలుగా భూమి కోసం మానసిక వేదనకు గురయ్యాడని... భూమి పోతుందనే భయంతో రాత్రి వేళల్లో కూడా ఏడ్చేవాడని చెప్పారు. భూమి సమస్య క్లియర్ అయితే... దాన్ని అమ్మి, అప్పు తీర్చి, ఇల్లు కట్టాలని భావించాడని తెలిపారు. సొంత ఆస్తిని కూడా అమ్ముకోలేక పోతున్నానని బాధ పడేవాడని చెప్పారు.

More Telugu News