IPL: ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్ ముందు జాతీయగీతం పాడించాలి: గంగూలీకి లేఖ రాసిన నెస్ వాడియా

  • బీసీసీఐ అధ్యక్షుడిగా ఇటీవలే బాధ్యతలందుకున్న గంగూలీ
  • బీసీసీఐకి గతంలోనూ లేఖ రాశానన్న వాడియా
  • ఐపీఎల్ ప్రారంభ వేడుకల రద్దు సరైన చర్య అని వెల్లడి

బీసీసీఐ కొత్త అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఫ్రాంచైజీ సహ యజమాని నెస్ వాడియా లేఖ రాశారు. ఐపీఎల్ వచ్చే సీజన్ నుంచి ప్రతి మ్యాచ్ ముందు జాతీయగీతం పాడించాలని కోరారు. సినిమా హాళ్లలో జాతీయ గీతం ప్రదర్శిస్తున్నారని భావిస్తున్నానని, అదే తరహాలో ఐపీఎల్ లో కూడా జనగణమన ఆలాపన ఉండాలని భావిస్తున్నామని నెస్ వాడియా తెలిపారు. ఇదే విషయమై తాను గతంలోనూ బీసీసీఐకి లేఖ రాశానని, ఇప్పుడు కొత్త అధ్యక్షుడు వచ్చిన నేపథ్యంలో మరోసారి లేఖ రాస్తున్నానని వెల్లడించారు. భారత జాతీయగీతం ఎంతో గొప్పదని పేర్కొన్నారు.

ఇండియన్ సూపర్ లీగ్, ప్రొకబడ్డీ లీగ్ పోటీల్లో కూడా జనగణమన పాడతారని, ఆఖరికి అమెరికాలోని ఎన్ బీఏ పోటీల్లో కూడా వారి జాతీయ గీతం ఆలపిస్తారని వాడియా వివరించారు. ఇక, ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలను రద్దు చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్టు వచ్చిన వార్తలను కూడా నెస్ వాడియా తన లేఖలో ప్రస్తావించారు. ప్రారంభ వేడుకల రద్దు సరైన నిర్ణయం అని అభిప్రాయపడ్డారు.

More Telugu News