TPCC: కాకరేపుతున్న టీపీసీసీ చీఫ్ పదవి.. బరిలో 8 మంది నేతలు!

  • ఆజాద్ సమక్షంలో షబ్బీర్ అలీ, వీహెచ్ వాగ్వివాదం
  • తనకు అప్పగిస్తే పార్టీని బలోపేతం చేస్తానన్న కోమటి రెడ్డి
  •   పీసీసీ చీఫ్‌ను మార్చాల్సిందేనన్న షబ్బీర్

టీపీసీసీ అధ్యక్ష పదవి తెలంగాణ కాంగ్రెస్‌లో కాకరేపేలా కనిపిస్తోంది. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ దారుణ పరాజయం తర్వాత పార్టీ తెలంగాణ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాకు సిద్ధమైనట్టు వార్తలు వచ్చాయి. దీంతో తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలను పరిశీలించేందుకు ఏఐసీసీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్‌ మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు.

మరోవైపు, టీపీసీసీ అధ్యక్ష పదవిపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ శాసనసభా పక్షనేత మల్లు భట్టు విక్రమార్క, పార్టీ సీనియర్ నేతలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్, సంపత్ కుమార్‌లు పోటీపడుతున్నట్టు సమాచారం.

కాగా, మొన్న గాంధీభవన్‌లో ఆజాద్‌తో జరిగిన సమావేశంలో పీసీసీ చీఫ్ మార్పుపై నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పీసీసీ చీఫ్‌ను మార్చాల్సిందేనని షబ్బీర్ అలీ ఈ సమావేశంలో డిమాండ్ చేసినట్టు సమాచారం. మరోవైపు, పీసీసీ పదవిని కోమటిరెడ్డికి ఇవ్వాల్సిందేనంటూ ఆయన అనుచరులు గాంధీభవన్ వద్ద ఆందోళనకు దిగారు. సీనియర్ నేత వీహెచ్, షబ్బీర్ అలీ మధ్య ఆజాద్ సమక్షంలో వాగ్వివాదం జరిగినట్టు చెబుతున్నారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ.. పీసీసీ చీఫ్ పదవి తనకు అప్పగిస్తే అన్ని వర్గాలను కలుపుకుని పోతానని, పార్టీని బలోపేతం చేస్తానని ఆజాద్‌కు చెప్పినట్టు తెలుస్తోంది.

More Telugu News