Botsa Satyanarayana: రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే రాజధానిని ప్రకటిస్తుంది: ఏపీ మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

  • మరోసారి రాజధాని అంశంపై స్పందించిన బొత్స
  • నిపుణుల కమిటీ రాష్ట్రమంతటా పర్యటిస్తోందని వెల్లడి
  • కమిటీ పర్యటన తర్వాత రాజధాని ప్రకటన ఉంటుందన్న మంత్రి

ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని అంశంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే రాజధానిని ప్రకటిస్తుందని అన్నారు. ప్రస్తుతం నిపుణుల కమిటీ రాష్ట్రమంతటా పర్యటిస్తోందని తెలిపారు. నిపుణుల కమిటీ నుంచి నివేదిక వచ్చాక రాష్ట్ర రాజధానిపై ప్రకటన ఉంటుందని వెల్లడించారు. రాజధాని నిర్మాణం కోసం రూ.5,400 కోట్లు ఖర్చయిందని, 90 శాతం పనులు పూర్తయినట్టు ఏ నిపుణుడినైనా చెప్పమనండి అంటూ సవాల్ విసిరారు.

ఎమ్మెల్యేల భవనాలు 67 శాతం పూర్తయ్యాయని, ఐఏఎస్ అధికారుల భవనాలు 26 శాతం పూర్తయ్యాయని తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎన్జీవోలు, ఐఏఎస్ అధికారుల భవనాలు మినహా మిగతావన్నీ తాత్కాలిక భవనాలేనని బొత్స పేర్కొన్నారు. నిపుణుల కమిటీ 13 జిల్లాల పర్యటన తర్వాత వారి అభిప్రాయాల ఆధారంగా ఏ భవనం ఎక్కడుండాలో నిర్ణయిస్తామని వివరించారు. కమిటీకి 6 వారాల సమయం ఇచ్చామని, ఇప్పటికే కమిటీ రెండుమూడు జిల్లాల్లో పర్యటించిందని బొత్స తెలిపారు.

More Telugu News