Bigg Boss: బిగ్ బాస్ ఇంట్లో మిగిలింది ఆ ఇద్దరే!

షార్ట్స్‌లో చూడండి
బిగ్ బాస్-3 రియాల్టీ షో చివరి అంకానికి చేరుకుంది. ఇవాళ జరుగుతున్న గ్రాండ్ ఫినాలే కార్యక్రమంలో తొలుత అలీ రెజా ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ ఇంట్లో స్పెషల్ గెస్ట్ గా అడుగుపెట్టిన హీరోయిన్ రాశీ ఖన్నా కవర్ లో అలీ రెజా పేరు బయటికి తీసింది. దాంతో అలీ రెజా ఎలిమినేట్ అయినట్టు హోస్ట్ నాగార్జున్ అనౌన్స్ చేశాడు. అలీ రెజా ఇప్పటికే ఓసారి ఎలిమినేట్ అయి మళ్లీ ప్రత్యేక అవకాశం అందిపుచ్చుకుని హౌస్ లో రీఎంట్రీ ఇచ్చాడు. అయితే టాప్ ఫైవ్ లో స్థానం దక్కించుకుని చివరి వారంలోకి ప్రవేశించినా, గ్రాండ్ ఫినాలేలో చివరి వరకు నిలవలేకపోయాడు.

ఇక రెండో ఎలిమినేషన్ వరుణ్ సందేశ్ ది. హీరో శ్రీకాంత్ రూ.20 లక్షల క్యాష్ తో హౌస్ లోకి వెళ్లి కంటెస్టెంట్లను ఊరించే ప్రయత్నం చేశాడు. రూ.20 లక్షలు తీసుకుంటారా, లేక ఎలిమినేట్ అవుతారా అంటూ డైలమాలో పడేసే ప్రయత్నం చేసినా కంటెస్టెంట్లు ఎవరూ డబ్బు తీసుకోలేదు. ఈ దశలో హీరోయిన్ క్యాథరిన్ ట్రెసా కవర్ తో బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లి వరుణ్ సందేశ్ ను బయటికి తీసుకువచ్చింది.

ఆ తర్వాత స్టార్ హీరోయిన్ అంజలి బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లింది. ఈసారి వంతు బాబా భాస్కర్ ది. అంజలి చేతుల్లో ఉన్న కవర్ లో ఆయన పేరే ఉంది. అయితే ఆ కవర్ ఓపెన్ చేసేముందు అంజలి కాస్తంత నాటకీయత జోడించింది. దాంతో కంటెస్టెంట్లు ఉద్విగ్నతకు గురయ్యారు. ఎట్టకేలకు బాబా భాస్కర్ పేరు అనౌన్స్ చేయడంతో ఎలిమినేట్ కాక తప్పలేదు. ఇక ఫైనల్స్ లో మిగిలింది రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి కావడంతో విజేత ఎవరన్నదానిపై ఉత్కంఠ తారాస్థాయికి చేరింది.
Go Back to Shorts
Bigg Boss
Andhra Pradesh
Telangana
Rahul
Sreemukhi

More Telugu News