Pawan Kalyan: కన్నబాబు బతుకు మాకు తెలియదా... రాజకీయాల్లోకి తెచ్చిందే మేము!: వైసీపీ మంత్రిపై పవన్ ధ్వజం

  • విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించిన పవన్
  • భారీగా హాజరైన కార్మికులు, కార్యకర్తలు
  • రాజకీయ ప్రత్యర్థులపై పవన్ విమర్శలు

విశాఖలో జనసేన బహిరంగ సభలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాట్లాడుతూ వైసీపీ మంత్రి కురసాల కన్నబాబుపై నిప్పులు చెరిగారు. నాగబాబు కారణంగానే కన్నబాబు రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. ఇప్పుడా కన్నబాబు తనను విమర్శిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నబాబు బతుకు తమకు తెలియదా, కన్నబాబును రాజకీయాల్లోకి తెచ్చిందే తామంటూ పవన్ తీవ్రస్థాయిలో విమర్శించారు.

"ఎన్నికల్లో రెండు స్థానాల్లో ఓడిపోయానని అలుసా, నాకు పదవి కంటే మిన్నగా ప్రజల హృదయాల్లో స్థానం లభించింది. అదే నాకు పెద్ద పదవి" అంటూ వ్యాఖ్యానించారు. అంతేగాకుండా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపైనా విమర్శలు చేశారు. ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఫ్యాక్షన్ తరహా విధానాలకు భయపడే వ్యక్తిని కాదని తెలిపారు. (విజయసాయిపై పవన్ మాట్లాడుతుండగా సభకు హాజరైన వారు ఏ2 అంటూ నినాదాలు చేశారు).

ఎంతో గొప్పవాళ్లు కూర్చునే రాజ్యసభలో సూట్ కేసు కంపెనీలు పెట్టే విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు కూర్చోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. 'విజయసాయిరెడ్డి గారూ, మీరు కూడా నన్ను విమర్శిస్తే ఎలాగండీ?' అంటూ హితవు పలికారు. రెండు చోట్ల ఓడిపోయానని, అందుకే భవన నిర్మాణ కార్మికుల సమస్యపై మాట్లాడే నైతికత లేదని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానిస్తున్నాడని, కానీ, అంబేద్కర్, కాన్షీరాం వంటి మహామహులు కూడా ఓటమిపాలయ్యారని, కానీ తన చిత్తశుద్ధిలో మాత్రం ఓటమి లేదని స్పష్టం చేశారు.

పవన్ కల్యాణ్ ఇసుక అంశంపై మాట్లాడుతూ, వైసీపీ సర్కారుకు రెండు వారాలు గడువు ఇస్తున్నామని, మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధి కోల్పోయిన కార్మికులకు రూ.50 వేలు ఆర్థికసాయం అందజేయాలని అన్నారు.

More Telugu News