Delhi: ఢిల్లీ బీజేపీ వెబ్ సైట్ పై హ్యాకర్ల పంజా... ఇంట్లో దూరి చంపేస్తామంటూ హెచ్చరిక

  • ఫిబ్రవరి 27వ తేదీన ఏం జరిగిందో గుర్తులేదా అంటూ ప్రకటన
  • అభినందన్ పాక్ సైనికులకు పట్టుబడిన రోజును ప్రస్తావించిన హ్యాకర్లు
  • మోదీపై విమర్శలు, పాక్ అనుకూల వాదనలు

ఇంటర్నెట్ లో హ్యాకింగ్ బెడద అంతాఇంతా కాదు. కంపెనీలు, రాజకీయ పక్షాలు, ప్రముఖులకు చెందిన సైట్లకు ఈ ముప్పు ఎక్కువగా ఉంటుంది. తాజాగా ఢిల్లీ బీజేపీ వెబ్ సైట్ కూడా హ్యాకింగ్ కు గురైనట్టు గుర్తించారు. "ఫిబ్రవరి 27వ తేదీన ఏంజరిగిందో గుర్తులేదా? ఈసారి అదే రోజున ఇంట్లో దూరి మరీ చంపేస్తాం" అంటూ వెబ్ సైట్ లో ప్రధాన పేజీలో ఓ ప్రకటన చేశారు. ఢిల్లీ బీజేపీ వెబ్ సైట్ ఓపెన్ చేయగానే హ్యాకర్ల హెచ్చరిక కనిపించింది.

ఈ నిర్వాకం తమదేనని పాకిస్థాన్ కు చెందిన మహ్మద్ బిలాల్ టీమ్ ఆ హెచ్చరికలో పేర్కొంది. ఈ ప్రకటనలో బీజేపీ వ్యతిరేక అభిప్రాయాలను, మోదీపై విమర్శలను, పాకిస్థాన్ అనుకూల వాదనలను కూడా పొందుపరిచారు. ఫిబ్రవరి 27వ తేదీనే హ్యాకర్లు ప్రత్యేకంగా ప్రస్తావించడానికి కారణం ఉంది. ఆ రోజునే భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాక్ సైనికులకు పట్టుబడ్డాడు. కాగా, హ్యాకింగ్ కు గురైన ఢిల్లీ బీజేపీ వెబ్ సైట్ ను బీజేపీ ఐటీ విభాగం నిపుణులు పునరుద్ధరించారు.

More Telugu News