tis hazari court: కోర్టు ఆవరణలో కుమ్మేసుకున్న పోలీసులు, లాయర్లు.. రణరంగాన్ని తలపించిన తీస్‌హజారీ కోర్టు

  • పోలీసు వ్యానను ఢీకొట్టిన లాయర్ వాహనం
  • లాయర్‌ను స్టేషన్‌కు తీసుకెళ్లి  విపరీతంగా కొట్టిన పోలీసులు
  • లాయర్లపై కాల్పులు
ఢిల్లీలోని తీస్‌హజరీ కోర్టు ఆవరణలో ఓ పోలీసు వ్యానుకు న్యాయవాది కారు ఢీకొట్టడంతో మొదలైన చిన్నపాటి గొడవ చినికిచినికి గాలివానగా మారి పోలీసులు, లాయర్లు మధ్య దాడికి కారణమైంది. లాయర్లు, పోలీసులు ఒకరిపై ఒకరు పడి కుమ్మేసుకోవడంతో కోర్టు ఆవరణ రణరంగాన్ని తలపించింది. ఈ ఘర్షణలో పదిమంది వరకు పోలీసులు గాయపడగా, పలువురు న్యాయవాదులకు గాయాలయ్యాయి. ఓ పోలీసు వాహనానికి నిప్పు పెట్టగా, 17 వాహనాలు ధ్వంసమయ్యాయి.

పోలీసు వ్యానును పొరపాటున ఢీకొట్టిన న్యాయవాదిని స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు అతడిని విపరీతంగా కొట్టారని తీస్‌హజారీ బార్‌ అసోసియేషన్‌ సెక్రటరీ జైవీర్‌సింగ్‌ చౌహాన్‌ ఆరోపించారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ తమను లోపలికి వెళ్లనివ్వలేదని, న్యాయమూర్తులు చెప్పినా పోలీసులు అతడిని విడిచిపెట్టలేదని అన్నారు. దీంతో నిరసనకు దిగిన తమపై పోలీసులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపినట్టు తెలిపారు. కాల్పుల్లో మొత్తం ఐదుగురు లాయర్లు గాయపడినట్టు పేర్కొన్నారు. పోలీసులు తమపై చేయి కూడా చేసుకున్నారని ఆరోపించారు.

కాగా, అరెస్ట్ చేసిన లాయర్‌ను పోలీసులు అరగంట తర్వాత విడిచిపెట్టారు. దీంతో ఈ ఘటనకు కారకులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ లాయర్లు కోర్టు గేటు వద్ద నిరసనకు దిగారు. ఈ క్రమంలో ఓ పోలీసు వాహనానికి లాయర్లు నిప్పు పెట్టారు. మరో 17 ఇతర వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా ఢిల్లీలోని జిల్లా కోర్టుల్లో రేపు బంద్‌కు ఢిల్లీ బార్‌ అసోసియేషన్‌ పిలుపునిచ్చింది.  
tis hazari court
New Delhi
Police
lawyers
clash

More Telugu News