Ayodhya: అయోధ్య తీర్పు రానున్న నేపథ్యంలో పోలీసులకు సెలవులు రద్దు చేసిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం

  • అయోధ్య తీర్పు నేపథ్యంలో ఉత్తర్వులు జారీ
  • నవంబర్ 1నుంచే ఉత్తర్వులు అమలు
  • అత్యవసర పరిస్థితుల్లో సెలవు తీసుకోవచ్చన్న సర్కారు

అయోధ్య భూవివాదంపై త్వరలో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణపై సీరియస్ గా దృష్టి సారించింది. నవంబర్ 1నుంచి పోలీసులు, అధికారులు, ఇతర సిబ్బందికి సెలవులు తీసుకోవద్దంటూ ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి నిన్న ఉత్తర్వులు వెలువడ్డాయి.

‘మిలాద్ ఉన్ నబీ, గురునానక్ జయంతి పండగలు వస్తున్నాయి. త్వరలో ఆయోధ్య కేసులో తీర్పు రానుంది. శాంతి భద్రతల పరిరక్షణకు అన్ని వేళలా పోలీసులు సిద్ధంగా ఉండాలి. నవంబర్ 1నుంచి పోలీసులు, సిబ్బంది సెలవులు తీసుకోవడాన్ని నిషేధించాం. మలి ఉత్తర్వులు వెలువడేవరకు పోలీసులు సెలవులు పెట్టకూడదు’ అని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

అత్యవసర పరిస్థితుల్లో సెలవు తీసుకోవాల్సి వస్తే సీనియర్ల అనుమతి పొందాలని పోలీసు ఉన్నతాధికారులు సూచించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్  ఈనెల 17న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, రిజర్వులో పెట్టిన అయోధ్య తీర్పును ఈలోపే వెలువరించే అవకాశముంది.

More Telugu News