Ashwathama Reddy: సమ్మెపై కేంద్ర ప్రభుత్వం వద్ద మొర పెట్టుకుంటాం: టీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి

  • ఈనెల 4 లేదా 5న కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలుస్తాం
  • సమ్మెను విరమించే ప్రసక్తే లేదు.. మరింత ఉద్ధృతం చేస్తాం
  • ఆర్టీసీ విభజనపై ప్రభుత్వ నిర్ణయం చెల్లుబాటు కాదు

తమ సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై కేంద్ర ప్రభుత్వానికి వివరిస్తామని టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. సమ్మెను విరమించే ప్రశ్నేలేదని మరింత ఉద్ధృతం చేస్తామని ప్రకటించారు. ఈ రోజు ఆయన ఆర్టీసీ జేఏసీ, ప్రతిపక్ష నేతలతో సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సమ్మెపై త్వరలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవనున్నట్లు చెప్పారు. ఆర్టీసీ జేఏసీ నేతలతో కలిసి ఈ నెల 4 లేదా 5న ఆయనతో  కలవనున్నట్లు అశ్వత్థామరెడ్డి వెల్లడించారు.

కార్మికులు ఆందోళన పడవద్దు:

ఆర్టీసీ విభజనపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది చెల్లుబాటుకాదని,  కార్మికులు ఆందోళనకు గురికావద్దని పేర్కొన్నారు. రూట్లను వేరుచేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పారు. సమస్యలు పరిష్కరించేవరకు సమ్మె కొనసాగిస్తామన్నారు. ఈ సమావేశంలో ఆయన తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. 3న రాష్ట్రంలోని అన్ని డిపోలు, గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 4న రాజకీయ పార్టీలతో డిపోల వద్ద దీక్ష, 5న సడక్ బంద్ రహదారుల దిగ్బంధం, 6న రాష్ట్ర వ్యాప్తంగా డిపోల ఎదుట నిరసన, 7న ఆర్టీసీ కార్మికుల కుటుంబ సభ్యులు, రాజకీయ పార్టీలతో డిపోల ముందు దీక్ష, 8న ఛలో ట్యాంక్ బండ్ సన్నాహక  కార్యక్రమాలు, 9న ట్యాంక్ బండ్ పై దీక్ష, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.

More Telugu News