haritha industrial park: తెలంగాణలో అందుబాటులోకి హరిత పారిశ్రామిక పార్క్‌: ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

  • దండు మల్కాపురంలో 1246 ఎకరాల్లో ఏర్పాటు
  • తొలివిడతగా 371 ఎకరాలు...మలివిడతలో 580 ఎకరాల భూ సేకరణ
  • 450 చిన్నాపెద్ద పరిశ్రమల ఏర్పాటు 

తెలంగాణలో మరో పారిశ్రామిక పార్క్‌ అందుబాటులోకి వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ సమీపంలోని దండు మల్కాపూర్‌ పరిధిలో హైదరాబాద్‌-విజయవాడ రహదారిని ఆనుకుని 1246 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేసిన ‘హరిత పారిశ్రామిక పార్క్‌’ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.

 మొత్తం 1553 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఈ పార్క్‌ కోసం తొలి విడతగా 371 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించారు. ఎకరానికి 11 లక్షల 60 వేల రూపాయల చొప్పున వారికి పరిహారం చెల్లించారు. రెండో విడతలో మరో 580 ఎకరాలను సేకరించారు. ఈ పార్క్‌లో 450 చిన్నా, పెద్ద పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉంది.

ఇప్పటికే అంతర్గత రోడ్లు, మిషన్‌ భగీరథ పైపులైన్లు, విద్యుత్‌ సౌకర్యం కల్పన కోసం ప్రభుత్వం రూ.36 కోట్లు కేటాయించింది. పార్క్‌లో పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శనా కేంద్రం కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ కారణంగా ప్రత్యక్షంగా 19వేలు, పరోక్షంగా 15 వేల మందికి ఉపాధి లభించనుంది. ఈ కార్యక్రమంలో జగదీశ్ రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

More Telugu News