aadhar card: హైదరాబాద్ పోస్టల్ శాఖ కీలక నిర్ణయం.. ఆధార్ సేవలు ఇక ఇంటి వద్దకే!

  • ఆధార్ సేవలు అవసరమైన వారు 30 మంది ఉంటే చాలు
  • సేవలను సద్వినియోగం చేసుకోవాలన్న పోస్టల్ శాఖ
  • 94406 44035.. అవసరమైన వారు ఈ నంబరుకు ఫోన్ చేయొచ్చు

తపాలా శాఖ మరో సరికొత్త సేవలతో ముందుకొస్తోంది. ఇకపై ఆధార్ సేవలను డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లో ఇప్పటికే వివిధ బ్రాంచ్‌లలో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేసిన పోస్టల్ శాఖ ఇప్పుడు నేరుగా ఇంటి వద్దే ఆ సేవలు అందించాలని నిర్ణయించింది. ఆధార్ నమోదు, మార్పు చేర్పులతోపాటు ఇతర సేవలు అందించనుంది. సేవలు అవసరమైన వారు పోస్టల్ శాఖకు సమాచారమివ్వడమే తరువాయి.. సేవలు ఇంటి ముందుకే వచ్చేస్తాయి.

గతంలో ఆదరాబాదరాగా చేసిన ఆధార్ నమోదు వల్ల చాలా సమస్యలు ఎదురయ్యాయి. అక్షరదోషాలు, ఇంటి పేరులో మార్పులు, పేర్లలో తప్పులు, పుట్టిన తేదీలు.. ఇలా చాలా సమస్యలు ఉత్పన్నమయ్యాయి. దీంతో వాటిని సరిద్దుకునేందుకు ప్రస్తుతం ప్రజలు ఆధార్ సెంటర్ల వద్ద క్యూకడుతున్నారు.

ఈ నేపథ్యంలో జాతీయస్థాయిలో యూఐడీఏఐతో రెండున్నరేళ్ల క్రితం ఒప్పందం కుదుర్చుకున్న తపాలా శాఖ  ఆధార్‌ అధీకృత కేంద్రాలను ఏర్పాటు చేసి సేవలు అందిస్తోంది. అప్పట్లో కేవలం ఆధార్ అప్‌డేషన్‌కు మాత్రమే పరిమితమైన పోస్టల్ శాఖ ఏడాది కాలంగా ఎన్‌రోల్‌మెంట్ కూడా చేస్తోంది. ఒక్కో పోస్టాఫీసులో రోజూ సుమారు 30 మందికి ఈ సేవలు అందిస్తోంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఈ సేవలు అందిస్తున్నారు. కొత్తగా ఆధార్‌ కార్డు నమోదును ఉచితంగా చేస్తుండగా, అప్‌డేషన్‌కు రూ. 50 వసూలు చేస్తున్నారు.  

తాజాగా ఈ సేవలను అవసరమైన వారి ఇంటి వద్దకే వచ్చి అందించాలని పోస్టల్ శాఖ నిర్ణయించింది. ఆధార్ సేవలు అవసరం ఉన్నవారు కనీసం 30 మంది ఉంటే, వారి ఇళ్ల వద్దకే వచ్చి సేవలు అందిస్తామని హైదరాబాద్ అబిడ్స్ జనరల్ పోస్టాఫీసు చీఫ్ పోస్టుమాస్టర్ జయరాజ్ తెలిపారు. ఇంటికొచ్చే తమకు కేవలం విద్యుత్ సౌకర్యం కల్పిస్తే సరిపోతుందని అన్నారు. అపార్ట్‌మెంట్ వాసులు, కాలనీ కమిటీలు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. 94406 44035 నంబరులోనూ సంప్రదించవచ్చని తెలిపారు.

More Telugu News