Jagan: సీఎం జగన్‌కు ఊరట లభిస్తుందా?: వ్యక్తిగత హాజరు మినహాయింపుపై తీర్పు నేడే!

  • సీఎం హోదాలో హైదరాబాద్ వస్తే రూ.60 లక్షలు ఖర్చవుతుందన్నజగన్
  • తన బదులు తన లాయర్ హాజరవుతారని పిటిషన్
  • వద్దే వద్దన్న సీబీఐ

అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిగత హాజరు మినహాయింపుపై నేడు కోర్టు తుదితీర్పు వెల్లడించనుంది. కోర్టుకు హాజరయ్యేందుకు వస్తే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నందున ఒక్క రోజుకు ఏకంగా రూ.60 లక్షలు ఖర్చవుతుందని, కాబట్టి తనకు బదులుగా తన న్యాయవాది కోర్టుకు హాజరయ్యేందుకు అనుమతించాలని జగన్ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.

నిజానికి కోర్టుకు హాజరయ్యేందుకు తనకు ఎటువంటి ఇబ్బంది లేదని, అయితే ముఖ్యమంత్రిగా అధికారిక విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని, దీనికితోడు ఆ హోదాలో హైదరాబాద్ వస్తే సెక్యూరిటీ, ప్రొటోకాల్ కోసం రోజుకు రూ. 60 లక్షలు ఖర్చవుతుందని ఆ పిటిషన్‌లో తెలిపారు. ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి ఇది మరింత భారంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు.

అయితే, జగన్ పిటిషన్‌ను సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. జగన్‌పై ఉన్నవి మామూలు అభియోగాలు కాదని, తీవ్ర అభియోగాలని పేర్కొంది. ఆయన ఎంపీగా ఉన్నప్పుడే సాక్షులను ప్రభావితం చేశారని, ఇప్పుడు సీఎం హోదాలో ఆ అవకాశాలు మరింత ఎక్కువగా ఉన్నాయని వాదించింది. కాబట్టి వ్యక్తిగత హాజరుపై మినహాయింపు ఇవ్వొద్దని అభ్యర్థించింది. రెండు వారాల క్రితమే ఈ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును నేటికి వాయిదా వేసింది. దీంతో నేడు ఎటువంటి తీర్పు వెలువడబోతోందన్న ఉత్కంఠ సర్వత్ర వ్యక్తమవుతోంది.  

More Telugu News