Rahul Gandhi: రాహుల్ విదేశీ టూర్ల వివరాలు పార్లమెంట్ కు తెలపాలి: బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్

  • 2014 నుంచి 16 సార్లు విదేశాలకు వెళ్లివచ్చారన్న జీవీఎల్
  • ఆ టూర్ల వెనక రహస్యాలు ఏమైనా ఉన్నాయా అంటూ వ్యాఖ్యలు
  • వ్యక్తి గత టూర్లైనప్పటికీ.. వెల్లడించడానికి జంకుతారెందుకన్న బీజేపీ నేత

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై బీజేపీ విమర్శలను తీవ్రం చేసింది. ఇటీవల మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కూడా రాహుల్ విదేశాలకు వెళ్లడంతో విమర్శలు వెల్లువెత్తాయి.  బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు  జీవీఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడుతూ రాహుల్ విదేశీ టూర్లపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు. రాహుల్ విదేశీ పర్యటనల వివరాలను పార్లమెంట్ కు తెలపాల్సి ఉంటుందన్నారు  

‘కాంగ్రెస్ నేతలు వెల్లడించిన సమాచారం ప్రకారం రాహుల్ ప్రస్తుతం మెడిటేషన్ ట్రిప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ నెల తొలి వారంలో కూడా ఆయన విదేశాలకు వెళ్లి వచ్చారు. పార్లమెంట్ కు ముందస్తుగా తెలపకుండా విదేశాలకు వెళ్లి వస్తున్నారు. ఒక ప్రజా ప్రతినిధిగా, సీనియర్ నేతగా ఆయన తన పర్యటనల వివరాలు పార్లమెంట్ కు తెలపాల్సిన అవసరముంటుందని అనుకుంటున్నా’ అని అన్నారు.

దేశ ప్రజలకు, సొంత పార్టీ నేతలకు తెలియకుండా రాహుల్ విదేశాల్లో ఏం చేస్తున్నారని నరసింహారావు ప్రశ్నించారు. 2014 నుంచి రాహుల్ 16 సార్లు విదేశాలకు వెళ్లి వచ్చారన్నారు. వ్యక్తిగత టూర్లైనప్పటికి వివరాలు వెల్లడించడానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి? అని జీవీఎల్ ప్రశ్నించారు.

More Telugu News