Rajasthan: ఇదెక్కడి మానవత్వం! మంటల్లో సజీవ దహనం అవుతుంటే.. తీరిగ్గా వీడియోలు తీసుకున్న జనం!

  • రాజస్థాన్ జిల్లాలోని కోట-ఉదయ్‌పూర్ జాతీయ రహదారిపై ఘటన
  • ఫ్యాక్టరీకి వెళ్తుండగా మంటల్లో చిక్కుకున్న కారు
  • చుట్టుముట్టి వీడియోలు తీసుకున్న జనం

ప్రమాదంలో అగ్నికి ఆహుతవుతూ రక్షించమని ఆర్తనాదాలు చేస్తుంటే చుట్టూవున్నవారు ఆ పనిమానేసి తమ వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్లలో తీరిగ్గా ఆ దృశ్యాన్ని చిత్రీకరిస్తూ చోద్యం చూశారు. మానవత్వానికే మాయనిమచ్చగా నిలిచిన ఈ ఘటన రాజస్థాన్‌లోని కోట-ఉదయ్‌పూర్ జాతీయ రహదారిపై జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం.. ప్రేమ్‌చంద్ జైన్ (53) అనే వ్యాపారి నిన్న ఉదయం తన కారులో ఫ్యాక్టరీకి బయలుదేరారు. కొంతదూరం ప్రయాణించాక ధక్కడ్‌ఖేడీ గ్రామం వద్ద ఆయన కారు అకస్మాత్తుగా ఆగిపోయింది. ఆ వెంటనే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులోంచి బయటపడేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కారు సెంట్రల్ లాకింగ్ వ్యవస్థ పనిచేయలేదు. ఫలితంగా ఆయన కారులోనే చిక్కుకుపోయారు. కారులో మంటలు చెలరేగడంతో అప్పటికే జనం అక్కడికి చేరుకున్నారు.

వారిని చూసిన జైన్ తనను రక్షించాల్సిందిగా లోపలి నుంచి ఆర్తనాదాలు చేశారు. అయితే, అతడిని ఏమాత్రం పట్టించుకోని చుట్టూ ఉన్న జనం.. కారులో జైన్ చిక్కుకుపోయి విలవిల్లాడుతున్న దృశ్యాలను చిత్రీకరించడంలో మునిగిపోయారు. చుట్టూ పదుల సంఖ్యలో జనాలున్నా ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయనను రక్షించేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం. వారిలో ఏ ఒక్కరు స్పందించినా జైన్ ప్రాణాలతో బయటపడేవారు. మంటల్లో చిక్కుకున్న ఆయన కారుతో సహా బుగ్గైపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

More Telugu News