Maharashtra: విలాసాల కోసం ఇళ్లకు కన్నాలు వేస్తున్న జంట.. యూట్యూబ్ సాయం తీసుకున్న వైనం!

  • యూ ట్యూబ్ లో చూసి నేర్చుకున్న విద్యార్థులు
  • గ్యాస్ కట్టర్లతో ఇళ్ల తలుపులు కోసి చోరీ
  • ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన శైలేష్, గౌరీల జంట

ఒకప్పుడు టీవీలు, సినిమాల్లో చూసి నేరాలు చేసేవారు. తాజాగా యూ ట్యూబ్ వేదికగా దొంగతనాలు ఎలా చేయాలో నేర్చుకుంటున్నారు. పాఠం సరిగా నేర్చుకోలేదేమో పథకం విఫలమై పోలీసులకు చిక్కి జైలుపాలయ్యారు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనల వివరాలను పోలీసులు మీడియాకు తెలిపారు. శైలేష్ దమ్రే, గౌరీ గోమడేలు గోరెవాడ ప్రాంతంలో కలిసి ఉంటున్నారు. శైలేష్ ఎంబీఏ చదువుతుండగా, గౌరీ చిత్రకళ మహావిద్యాలయంలో బీఏ చేస్తోంది. 

విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డ వీరు డబ్బులకోసం యూ ట్యూబ్ లో చోరీలు ఎలా చేయాలనేది చూస్తుండేవారు. గ్యాస్ కట్టర్ తో ఇళ్ల తలుపులను ఎలా తెరవవచ్చో నేర్చుకున్నారు. నెలకు రెండు లేదా మూడు ఇళ్లలో దోపిడీ చేస్తూ తమ అవసరాలను తీర్చుకునేవారు. వీరు లేటెస్ట్ గా మంకాపూర్ లో చోరీ చేశారు. ఓ ఇంట్లోకి ప్రవేశించి రూ.2 లక్షలు ఎత్తుకెళ్లారు.

బాధితుల ఫిర్యాదులతో రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు వీరిని పట్టుకున్నారు. చోరీలకు శిక్షణను యూట్యూబ్ వీడియోల నుంచి పొందామని చెప్పడంతో పోలీసులు నోరెళ్లబెట్టారు. వారి నుంచి గ్యాస్ కట్టర్ లు, సిలిండర్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఏటీఎంలను ఎలా దోచుకోవాలో యూ ట్యూబ్ లో  నేర్చుకుంటున్నట్లు విచారణలో చెప్పారని పోలీసులు పేర్కొన్నారు.

More Telugu News