Ayodhya: అయోధ్య తీర్పు నేపథ్యంలో ఆరెస్సెస్ కీలక నిర్ణయాలు

  •  ప్రచారక్ లు తమకు నిర్దేశించిన కేంద్రాల్లోనే ఉండాలి
  •  నవంబర్ లో జరగాల్సిన సంఘ్ కార్యక్రమాలన్నీ రద్దు 
  • సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పునకు కట్టుబడి ఉండటానికి నిర్ణయం..?

అయోధ్య వివాదంపై వచ్చేనెల 17 లోపు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో.. ఆరెస్సెస్(రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) ముందుజాగ్రత్తగా పలు నిర్ణయాలు తీసుకుంది. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పునకు కట్టుబడి ఉండటానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం. తీర్పు నేపథ్యంలో అత్యంత జాగరూకతతో ఉండాలని కార్యకర్తలకు, స్వయం సేవకులకు సూచించింది. ప్రచారక్ లు తమకు నిర్దేశించిన కేంద్రాల్లోనే ఉండాలని పేర్కొంది. సంస్థ అగ్ర నేతలకు ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేసింది.

మరోవైపు నవంబర్ లో జరగాల్సిన సంఘ్ కార్యక్రమాలన్నీ రద్దు చేయాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత అనుకోనిది జరిగితే ఆ అపవాదును సంఘ్ పై పడకుండా పలు చర్యలు చేపట్టింది. ఐదేళ్లకొకసారి ఆరెస్సెస్ అగ్రనేతలు పాల్గొనే భేటీని వాయిదా వేసింది. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, సురేష్ భయ్యాజీ, దత్తాత్రేయ హోసబలే తో పాటు ఇతర సంఘ్ పరివార్ నేతలు, బీజేపీ నేతలు పాల్గొనాల్సిన ఈ సదస్సు రేపటి నుంచి నవంబర్ 4 వరకు హరిద్వార్ లో జరగాల్సి ఉంది.

ఈ సదస్సులో ఆయోధ్యలో రామాలయ నిర్మాణానికి చేపట్టాల్సిన ప్రణాళికలు, నిర్మాణ తేదీలు చర్చిస్తారన్న ఊహ గానాలు వచ్చాయి. ఆరెస్సెస్ తాజా నిర్ణయంతో ఇవన్నీ పుకార్లేనని తేలిపోయింది. నవంబర్ 4న అయోధ్యలో జరగాల్సిన దుర్గావాహిని క్యాంప్, 17న లక్నోలో జరగాల్సిన ఏకల్ కుంభ్ కార్యక్రమాలను కూడా సంఘ్ రద్దు చేసింది.

More Telugu News