Shakib Al Hasan: బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబల్ పై నిషేధం.. ఐసీసీ ఆదేశాలు?

  • రెండేళ్ల క్రితం బుకీ కలిసినా ఐసీసీకి చెప్పలేదంటూ ఆరోపణలు 
  • ఆరోపణలు నిజమైతే షకిబల్ పై 18 నెలల నిషేధం 
  • భారత్ లో పర్యటించే బంగ్లా జట్టులో చోటు అనుమానమే!

బంగ్లాదేశ్ టీ 20, టెస్టు జట్ల కెప్టెన్ షకిబల్ హసన్ క్రికెట్ కెరీర్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. రెండేళ్ల క్రితం ఓ అంతర్జాతీయ మ్యాచ్ ప్రారంభానికి ముందు బుకీ ఒకరు షకిబ్ ను కలిశాడని ఓ పత్రికలో వార్తలు రావడంతో ఐసీసీ దీనిపై దృష్టి సారించింది. షకిబల్ ఈ విషయాన్ని ఐసీసీ అవినీతి నిరోధక విభాగానికి వెల్లడించలేదని పేర్కొంది. తమ విచారణలో షకిబల్ ఈ విషయాన్ని ఒప్పుకున్నాడని కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో అతన్ని క్రికెట్ కు దూరంగా ఉంచాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును ఐసీసీ ఆదేశించింది. దీంతో షకిబల్ ప్రాక్టీస్ కు కూడా దూరమయ్యాడు.

ఇటీవల బంగ్లా క్రికెటర్లు తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. బీసీబీ ఈ గండం నుంచి బయటపడ్డప్పటికీ షకిబల్ వ్యవహారం బోర్డుకు మింగుడుపడటంలేదు. వచ్చే నెల 3 నుంచి భారత్ లో బంగ్లాదేశ్ జట్టు పర్యటన షురూ కానున్న నేపథ్యంలో ఆ జట్టుకు మీర్పూర్ లో ప్రాక్టీస్ మ్యాచ్ ఏర్పాటు చేశారు. షకిబల్ దీనికి హాజరు కాలేదు. దీంతో అతను భారత పర్యటనలో పాల్గొనడంపై అనుమానాలు నెలకొన్నాయి.

షకిబల్ పై ఆరోపణలు రుజువైతే అతనిపై 18 నెలల నిషేధం విధించే అవకాశముంది. ఒకవేళ నిషేధం ఖరారైతే అతని స్థానంలో ముష్ఫికర్ రహీమ్ టెస్టు జట్టుకు, మొసాదిక్ హుసేన్ టీ20 జట్టుకు కెప్టెన్లుగా వ్యవహరించే అవకాశముంది.

More Telugu News