Hyderabad: అత్తపై పగ తీర్చుకోవాలని... 2 కిలోల బంగారం, 6.7 కిలోల వెండి దొంగిలించిన యువతి!

  • ఈనెల 21న దొంగతనం
  • పోలీసుల విచారణలో విస్తుపోయే నిజం
  • దొంగతనానికి సహకరించిన వియ్యపువారు

తనకు, తన భర్తకు మధ్య అత్తే అడ్డమని, ఆమె కారణంగానే విభేదాలు వస్తున్నాయన్న ఆగ్రహంతో ఓ యువతి ఇంట్లోని 2 కిలోల బంగారం, 6.7 కిలోల వెండిని దొంగిలించింది. తన ఇంట్లోని ఆభరణాలు పోయాయని వడ్డీ వ్యాపారి సరళ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించి, ఆరు రోజుల పాటు విచారణ జరిపిన పోలీసులు, ఆ ఇంటి కోడలు సుప్రియే నిందితురాలని తేల్చారు. సుప్రియకు ఆమె తల్లిదండ్రులు శ్రీనివాస్, సునీతలతో పాటు సోదరుడు సాత్విక్ కూడా సాయం చేశారని, వారందరినీ అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.

కాగా, సరళ కుమారుడు ధీరజ్ తో నాలుగు నెలల క్రితమే సుప్రియ వివాహం జరగడం గమనార్హం. ఆపై నెల రోజుల వ్యవధిలోనే ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. తన కాపురం సజావుగా సాగదని సుప్రియకు అర్థమైపోయింది. అత్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. దసరా పండగకు భర్త వద్దకు వెళ్లినా ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. ఇంటి తాళాల సెట్ ను తీసుకుని పుట్టింటికి చేరుకుని, అత్తపై పగ తీర్చుకునేందుకు సహకరించాలని కోరితే కుటుంబీకులు అంగీకరించారు.

ఈ క్రమంలో 21న ఇంటి పరిసరాల్లో మాటేసి, అత్త బయటకు వెళ్లగానే సుప్రియ, సాత్విక్ లు ఇంట్లోకి ప్రవేశించి ఆభరణాలు దొంగిలించారు. దొంగలు పడ్డారని అనుకునేలా దుస్తులను చిందర వందర చేశారు. బయటకు వెళ్లేటప్పుడు గొళ్లెం వేయకుండా వెళ్లిపోయారు. సరళ ఇంటికి వచ్చిన తరువాత, దొంగతనం జరిగిందన్న ఆలోచనలో పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి, ఇది ఇంటి దొంగల పనేనని తేల్చారు.

More Telugu News