Donald Trump: తన ముగ్గురు పిల్లలను చంపి బాగ్దాదీ ఆత్మాహుతికి పాల్పడ్డాడు: ట్రంప్ వెల్లడి

  • బాగ్దాదీ మృతిని ధృవీకరించిన అమెరికా అధ్యక్షుడు
  • పిరికిపందలా చనిపోయాడని వ్యాఖ్యలు
  • బాగ్దాదీపై దాడికి వారం క్రితమే వ్యూహ రచన
ఐసిస్ చీఫ్ అబూబకర్ అల్ బాగ్దాదీ మృతిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ధారించారు. అమెరికా సైనిక దాడుల సమయంలో బాగ్దాదీ ఆత్మాహుతికి పాల్పడ్డాడని ట్రంప్ వెల్లడించారు. తొలుత తన ముగ్గురు పిల్లలను చంపి, ఆపై తనను తాను పేల్చుకున్నాడని వివరించారు. ప్రపంచాన్ని భయపెట్టాలని చూసిన బాగ్దాదీ భయంతో పిరికిపందలా కుక్క చావు చచ్చాడని ట్రంప్ వ్యాఖ్యానించారు. బాగ్దాదీ తన చివరి క్షణాల్లో భయంతో వణికిపోయాడని, ప్రాణభయంతో భీతిల్లిపోయాడని వివరించారు. అమెరికా దళాలను చూడగానే ఓ సొరంగంలో దాక్కున్నాడని, రెండు గంటల ఆపరేషన్ అనంతరం బాగ్దాదీ ఆత్మాహుతితో చనిపోయాడని ట్రంప్ పేర్కొన్నారు.

సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులే లక్ష్యంగా అమెరికా చేపట్టిన స్పెషల్ ఆపరేషన్లో బాగ్దాదీ హతుడైనట్టు ఈ ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. ఇవాళో పెద్ద ఘటన జరిగిందని ట్రంప్ పేర్కొనడంతో బాగ్దాదీ మరణంపై కథనాలకు మరింత బలం చేకూరింది. కాగా, బాగ్దాదీని అంతమొందించేందుకు అమెరికా వారం క్రితమే వ్యూహరచన చేయగా, ట్రంప్ ఆమోదంతో కమాండోలు రంగంలోకి దిగి విజయవంతంగా పని పూర్తిచేశారు.  మృతి చెందింది బాగ్దాదీయేనని డీఎన్ఏ టెస్టులు కూడా నిర్ధారించాయని ట్రంప్ వెల్లడించారు.
Donald Trump
Baghdadi
ISIS
Syria

More Telugu News