Kolkata: అమ్మాయి భీమిలీ బీచ్ లో ఉందని చెబితే... నమ్మి, అడ్డంగా మోసపోయిన హెచ్ఎస్బీసీ ఉద్యోగి!

  • కోల్ కతా కేంద్రంగా హనీట్రాప్ ముఠా
  • వైజాగ్ వ్యక్తిని ముగ్గులోకి దింపిన యువతి
  • రూ. 18 లక్షలు సమర్పించుకున్న బాధితుడు

ఆన్ లైన్ డేటింగ్ వెబ్ సైట్లు అమాయకులను ఎంతగా మోసం చేస్తున్నాయో చెప్పేందుకు ఇది మరో ఉదాహరణ. విశాఖపట్నానికి చెందిన హెచ్ఎస్బీసీ ఉద్యోగి ఒకరు 'పర్పుల్ ఫాంటసీ డేటింగ్' వెబ్ సైట్ ను నమ్మి, ఏకంగా 18 లక్షలు సమర్పించుకుని, ఇప్పుడు లబోదిబోమంటున్నాడు. వివరాల్లోకి వెళితే...

నాలుగు నెలల క్రితం బాధితులు వెబ్ సైట్ కు తన వివరాలు ఇచ్చాడు. ఆ వెంటనే ఓ యువతి అతనితో మాట్లాడింది. మత్తెక్కించేలా ఇంగ్లంలో, హిందీలో మాట్లాడింది. తన ట్రాప్ లో బాధితుడిని పడేసింది. తన పరిచయం ఎంతో ఎంజయ్ నిస్తుందని నమ్మబలికింది. విశాఖలో తమ నెట్ వర్క్ ఉందని, గోల్డెన్, ప్రీమియర్ తదితర కార్డులున్నాయని చెప్పి, రిజిస్ట్రేషన్, టాక్స్ లు, ఫీజులు అంటూ డబ్బు గుంజింది.

ఓ మారు అమ్మాయి భీమిలీ బీచ్ లో ఉందని చెప్పింది. దీంతో అతను ఆశగా వెళ్లి, ఎవరూ లేక తిరిగొచ్చాడు. ఆపై సింహాచలం వద్ద యువతి మీ కోసం ఎదురు చూస్తోందని నమ్మబలికింది. అక్కడా బాధితుడికి నిరాశే ఎదురైంది. డబ్బుల వసూలు మాత్రం ఆగలేదు. మొత్తం రూ. 18 లక్షలు ముట్టజెప్పిన తరువాతే బాధితుడికి తాను మోసపోయానన్న విషయం అర్థమై, సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, కోల్ కతా నుంచి ఈ దందా సాగిందని తేల్చి, అక్కడి టాలీ గ్యాంగ్ ప్రాంతంలోని ఓకెలం ఐటీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో పనిచేస్తున్న వారిని అరెస్ట్ చేశారు. అక్కడ టెలీ కార్లుగా పనిచేస్తున్న 24 మంది అమ్మాయిలను విచారించగా, విశాఖపట్నంలో మరో వ్యక్తి నుంచి రూ. 3 లక్షలు గుంజినట్టు తేలింది. వారిని అక్కడే అరెస్ట్ చేసిన వైజాగ్ పోలీసులు, కోర్టులో హాజరు పరిచి, తదుపరి విచారణ నిమిత్తం వైజాగ్ తీసుకు రావాలని నిర్ణయించారు. వీరిని మరింత లోతుగా విచారించాలని పోలీసులు భావిస్తున్నారు.

More Telugu News