Bangladesh: యువతి సజీవ దహనం కేసులో 16 మందికి మరణశిక్ష.. బంగ్లాదేశ్ కోర్టు సంచలన తీర్పు

  • ప్రిన్సిపాల్ వేధిస్తున్నాడంటూ పోలీసులకు యువతి ఫిర్యాదు
  • కాలేజీలోనే యువతిని కట్టేసి సజీవ దహనం
  • బంగ్లాదేశ్‌లో సంచలనమైన నుస్రత్ కేసు

యువతిని సజీవ దహనం చేసిన కేసులో 16 మంది నిందితులను దోషులుగా తేల్చిన బంగ్లాదేశ్ కోర్టు వారందరికీ మరణశిక్షను విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. ప్రిన్సిపాల్ తనను వేధిస్తున్నాడంటూ నుస్రత్ జహాన్ రఫీ అనే అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రిన్సిపాల్‌ను అరెస్ట్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన ప్రిన్సిపాల్ మద్దతుదారులు కేసును వెనక్కి తీసుకోవాలంటూ యువతిని బెదిరించినా ఆమె మాత్రం వెనక్కి తగ్గలేదు.

దీంతో కక్ష పెంచుకున్న నిందితులు ఈ ఏడాది ఏప్రిల్ 6న కాలేజీలోనే ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఆమెను కట్టేసి కిరోసిన్ పోసి సజీవ దహనం చేశారు. 80 శాతం గాయాలతో ఆసుపత్రిలో చేరిన నుస్రత్ ఐదు రోజుల చికిత్స తర్వాత ప్రాణాలు కోల్పోయింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు విషయంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో స్పందించిన ప్రధాని షేక్ హసీనా నిందితులకు కఠిన శిక్ష తప్పదని హెచ్చరించడంతో  ఆందోళనలు తగ్గాయి. నుస్రత్ కేసును నీరుగార్చే ప్రయత్నం కూడా జరిగింది. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

నుస్రత్ కేసును విచారించేందుకు ఏర్పాటైన ఫాస్ట్‌ట్రాక్ కోర్టు త్వరితగతిన విచారణ పూర్తిచేసింది. గురువారం తుది తీర్పు ప్రకటించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న 16 మంది నిందితులను దోషులుగా ప్రకటించిన కోర్టు వారికి మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. కోర్టు తీర్పుపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, దోషుల తరపు న్యాయవాదులు మాత్రం తాము ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు.

More Telugu News