Andhra Pradesh: రాజధాని నిర్మాణం, స్విస్ చాలెంజ్ విధానంపై మీ వైఖరి ఏమిటి?: ఏపీ సర్కారుకు హైకోర్టు ప్రశ్న

  • కూర్చోవడానికి కూడా చోటు లేదు
  • న్యాయమూర్తులు గెస్ట్ హౌస్ లలో ఉంటున్నారు
  • రెండు వారాల్లో చెప్పాలని ధర్మాసనం ఆదేశం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎన్నో సమస్యలు ఉన్నాయని, ఇక్కడికి వచ్చేందుకు ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారని, కూర్చోవడానికి చోటు లేకపోవడంతో పాటు, తాగాలంటే కప్పు టీ కూడా దొరకని పరిస్థితి నెలకొందని, మరెంతకాలం ఇలాగ ఉండాలని హైకోర్టు ఏపీ సర్కారును ప్రశ్నించింది. న్యాయమూర్తులకు ఇళ్లు లేవని, వారంతా గెస్ట్ హౌస్ లలో ఉంటున్నారని గుర్తు చేస్తూ, తగినన్ని సౌకర్యాలు కల్పించకుంటే తాము కల్పించుకోవాల్సి వుంటుందని హెచ్చరించింది.

మాజీ సీఎం, ఇప్పటి సీఎంల ఎజెండాలు ఏమిటన్న విషయంతో తమకు సంబంధం లేదని, చట్టంతో మాత్రమే తమకు సంబంధమని, రాజధాని నిర్మాణం, స్విస్ చాలెంజ్ విధానంపై ప్రభుత్వ వైఖరి చెప్పాలని ఆదేశించింది. ఇటీవలి కాలంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో పాటు ఆంధ్రప్రదేశ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ ఎనేబులింగ్ (ఏపీఐడీఈ) చట్టం-2001కు సవరణ చేస్తూ, న్యాయశాఖ కార్యదర్శి ఏప్రిల్ 19, 2017 తీసుకొచ్చిన చట్ట సవరణ 3/2017పై దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

స్విస్ చాలెంజ్ విధానాన్ని సవాలు చేస్తూ, మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లు పిటిషన్లను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అమరావతి స్టార్టప్ ప్రాంత అభివృద్ధిపై ఫౌండేషన్ ఫర్ సోషల్ అవేర్ నెస్ సొసైటీ మెంబర్ వై సూర్యనారాయణమూర్తి సైతం కోర్టును ఆశ్రయించారు.

హైకోర్టు వద్ద నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి వుండాలని, రెండు వారాల్లో తమ వైఖరేంటో చెబుతూ ప్రమాణ పత్రాన్ని దాఖలు చేయాలని ఆదేశించింది. అంతకు మించి గడువు ఇచ్చే పరిస్థితి లేదని తేల్చి చెప్పింది. తేడా వస్తే మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని, వాటిపై అభ్యంతరాలుంటే, సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చని చెబుతూ, తదుపరి విచారణను వచ్చే నెల 21కి వాయిదా వేసింది. స్విస్ చాలెంజ్ విధానాన్ని ప్రస్తుత ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎస్జీపీ వ్యాఖ్యానించగా, అసంతృప్తిని వ్యక్తం చేసిన ధర్మాసనం, ఇంకా ఎన్ని రోజులు సమీక్షిస్తారని ప్రశ్నించింది. ఏం చేయాలనుకున్నా, త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

More Telugu News