Haryana: హంగ్ దిశగా హర్యానా... కింగ్ మేకర్ జేజేపీ... తీవ్ర ఉత్కంఠ!

  • మ్యాజిక్ ఫిగర్ 46
  • ప్రస్తుతం 38 స్థానాలకు బీజేపీ పరిమితం
  • కీలకంగా మారిన జేజేపీ
90 అసెంబ్లీ నియోజకవర్గాలున్న హర్యానాలో ప్రజలు ఏ పార్టీకీ భారీ ఆధిక్యాన్ని ఇచ్చే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది. అధికారంలో ఉన్న బీజేపీ, మరోసారి గద్దెనెక్కేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కు ఒకటి, రెండు అడుగుల దూరంలో నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్, జేజేపీలు కలిస్తే, మ్యాజిక్ ఫిగర్ కు మరింత చేరువయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో ఈ దఫా హంగ్ ఏర్పడవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుత ట్రెండ్స్ పరిశీలిస్తే, బీజేపీ 38, కాంగ్రెస్ 29, ఐఎన్ఎల్డీ 1, జేజేపీ 12, ఇతరులు 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, మరో రెండు చోట్ల సాంకేతిక కారణాలతో ఓట్ల లెక్కింపు ఆలస్యమైంది. అధికార పీఠం దక్కాలంటే 46 సీట్లు అవసరం కాగా, ఏ పార్టీకీ అన్ని సీట్లు లభించే అవకాశం ప్రస్తుతం కనిపించడం లేదు. ఫలితాల సరళి తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తుండటంతో క్యాంప్ రాజకీయాలు సైతం మొదలైపోయాయి.

ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ పార్టీ కార్యాలయానికి చేరుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించింది. ఇదే సమయంలో జేజేపీని కలుపుకుని ముందుకు సాగే దిశగానూ ఆ పార్టీ తనవంతు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు సమాచారం. చివరి వరకూ ఫలితాలు ఇదే విధంగా కొనసాగితే, జేజేపీ కింగ్ మేకర్ అవుతుందనడంలో సందేహం లేదు.
Haryana
JJP
Congress
BJP
Hung
King Maker

More Telugu News