Telugudesam: ఇలాంటి చిల్లర కథనాలు ఆపకపోతే మీ దొంగ పత్రిక బట్టలూడదీస్తాం: ‘సాక్షి’పై నారా లోకేశ్ ధ్వజం

  • కట్టుకథలు అల్లేందుకు పుట్టిన విషపుత్రిక ‘సాక్షి’
  • నీతి లేని కథనాలతో నాపై దుష్ప్రచారం మొదలుపెట్టింది
  • చిరుతిళ్ళ కోసం నేను రూ.25 లక్షలు ఖర్చుపెట్టేసానట!

తనపై అసత్య కథనాలు ప్రచురించిన ‘సాక్షి’ పత్రికపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఇలాంటి చిల్లర కథనాలు ఆపకపోతే మీ దొంగ పత్రిక బట్టలు వూడదీసి ప్రజల ముందు నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాం’ అంటూ లోకేశ్ హెచ్చరించారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. అక్రమాస్తుల పెట్టుబడులతో కట్టుకథలు అల్లేందుకు పుట్టిన విషపుత్రిక ‘సాక్షి’, సీఎం జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్ళారో, ఏం సాధించుకు వచ్చారో చెప్పుకోలేని సిగ్గుమాలిన స్థితిలో, ‘సాక్షి’ మీడియాకి ఏం చేయాలో తోచక, నీతి లేని కథనాలతో తనపై దుష్ప్రచారం మొదలుపెట్టిందని ధ్వజమెత్తారు.  

టీడీపీ అధికారంలో ఉండగా తాను విశాఖ ఎయిర్ పోర్టులో కూర్చుని చిరుతిళ్ళ కోసం రూ.25 లక్షలు ఖర్చుపెట్టేసానంటూ సాక్షి ఒక అసత్య కథనం వండి వార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అసత్యకథనం ఆధారాల కోసం వాళ్ళు చూపించిన ఫుడ్ బిల్లులో ఉన్న తేదీల్లో తాను రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ఉన్నానని అన్నారు.

ఇలాంటి నిరాధార కథనాలు రాసుకోవడానికి సిగ్గుండక్కరలేదా? అని ప్రశ్నించారు. ఒక అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నంలో నేరగాళ్ళు మరిన్ని అబద్ధాలు అతికించే ప్రయత్నం చేస్తారని, ‘సాక్షి’ తనపై బురద జల్లుతూ అలాంటి తప్పులన్నింటినీ చేసిందని లోకేశ్ విరుచుకుపడ్డారు.

More Telugu News