Hyderabad: వేసిన తాళాలు వేసినట్టే.. హైదరాబాద్‌లో వడ్డీవ్యాపారి ఇంట్లో భారీ చోరీ

  • బోయిన్‌పల్లిలో ఘటన
  • ఐదున్నర కిలోల బంగారం, ఏడు కిలోల వెండి, రూ.18 లక్షల నగదు చోరీ
  • తాళాలు వేసినట్టే ఉండడంతో ఇంటి దొంగలపై అనుమానం?

హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. బాధితులు పనిపై బయటకు వెళ్లి వచ్చేసరికే దొంగలు ఇల్లును గుల్ల చేశారు. నగలు, డబ్బు మాయమైనట్టు గుర్తించిన బాధితులు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పాతబోయిన్‌పల్లి మల్లికార్జున‌నగర్‌కు చెందిన సరళ వడ్డీ వ్యాపారి. సోమవారం సాయంత్రం ఆమె పనిపై బోయిన్‌పల్లి వెళ్లి తిరిగి ఇంటికి చేరుకున్నారు. తాళాలు తీసి లోపలికి వెళ్లి చూసి షాకయ్యారు. చోరీ జరిగినట్టు గుర్తించి పోలీసులను ఆశ్రయించారు.

ఐదున్నర కిలోల బంగారు నగలు, ఏడు కిలోల వెండి, 18 లక్షల రూపాయల నగదు చోరీకి గురైనట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు సరళ పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇది ఇంటి దొంగల పనా? లేక, దొంగల ముఠా పనా? అన్న కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.

More Telugu News