Infosys: ఇన్ఫోసిస్ సీఈవో, సీఎఫ్ వోలపై ఫిర్యాదు చేసిన సంస్థ ఉద్యోగులు

  • రెండు త్రైమాసికాల లెక్కలు తప్పుగా చూపారు
  • మా వద్ద వాయిస్ రికార్డింగ్ సాక్ష్యాలు ఉన్నాయి
  • సీఈవో ఫరేఖ్ చేతిలో సీఎఫ్ వో నీలాంజన్ రాయ్ కీలుబొమ్మగా మారారు

ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి (సీఈవో) సలీల్ పరేఖ్, ముఖ్య ఆర్థిక వ్యవహారాల అధికారి( సీఎఫ్ వో) నీలాంజన్ రాయ్ లు తప్పుడు విధానాలు పాటిస్తున్నారని పేర్లు వెల్లడించని కొందరు ఉద్యోగులు కంపెనీ బోర్డుకు ఫిర్యాదు చేశారు. ‘పరేఖ్, రాయ్ లు గత కొన్ని త్రైమాసికాల ఫలితాల వెల్లడిలో అనైతికంగా వ్యవహరిస్తున్నారు. వీరి వ్యవహారాలకు సంబంధించి మా వద్ద వాయిస్ రికార్డింగ్ లు, ఈ మెయిల్ రూపంలో సాక్ష్యాలున్నాయి’ అని వారు లేఖలో పేర్కొన్నారు. వీరి ఫిర్యాదు పట్ల బోర్డు నుంచి స్పందన కానరాకపోవడంతో అక్టోబర్ తొలి వారంలో ఫిర్యాదుదారులు అమెరికాలోని విజిల్ బ్లోయర్ ప్రొటెక్షన్ ప్రోగ్రాం కార్యాలయానికి మరో లేఖ రాశారు.

జూన్- సెప్టెంబర్ త్రైమాసికంలో వీసా తదితర వ్యయాలను ఖాతాల్లో చూపవద్దని... ఓ కాంట్రాక్టులో 5 కోట్ల డాలర్ల విలువ చేసే లెక్కలను పరిగణనలోకి తీసుకోవద్దని తమపై ఒత్తిడి పెంచారని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. సీఈవో ఫరేఖ్ చేతిలో సీఎఫ్ వో నీలాంజన్ రాయ్ కీలుబొమ్మగా మారారన్నారు. అంతేకాక ముఖ్యమైన సమాచారాన్ని ఆడిటర్లు, బోర్డుకు తెలియకుండా దాచారన్నాని వారు ఆరోపించారు. ఈ ఫిర్యాదులపై స్పందించిన ఇన్పోసిస్ బోర్డు.. ఈ ఫిర్యాదులను ఆడిట్ కమిటీ ముందుకు తీసుకెళ్లి సమస్య పరిష్కారిస్తామని తెలిపింది.

More Telugu News