Ranchi: రాంచీ టెస్టులో ముగిసిన మూడో రోజు ఆట

  • రెండో ఇన్నింగ్స్ లో 8 వికెట్లకు 132 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా
  • ఇంకా 203 పరుగుల లోటు
  • ఖాయమైన టీమిండియా విజయం

భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రాంచీలో జరుగుతున్న మూడో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. ఆట చివరికి సఫారీలు రెండో ఇన్నింగ్స్ లో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేశారు. ఇంకా 203 పరుగులు వెనుకబడే ఉన్నారు. చేతిలో 2 వికెట్లు మాత్రమే మిగిలున్న నేపథ్యంలో దక్షిణాఫ్రికా ఓటమి ఖాయమైంది. ఇంకా ఆటకు రెండ్రోజులు మిగిలున్నా సఫారీలు చేయడానికి ఏమీ లేదు.

అంతకుముందు, భారత్ తొలి ఇన్నింగ్స్ ను 497/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. బదులుగా తొలి ఇన్నింగ్స్ ఆడిన దక్షిణాఫ్రికా 162 పరుగులకు ఆలౌటై ఫాలో ఆన్ ఉచ్చులో పడింది. రెండో ఇన్నింగ్స్ లోనూ సఫారీ బ్యాట్స్ మన్లు పేలవ ఆటతీరుతో మూల్యం చెల్లించుకున్నారు. క్రీజులో నిలదొక్కుకోక ముందే పెవిలియన్ కు క్యూ కట్టారు. షమీ 3 వికెట్లు తీయగా, ఉమేశ్ 2 వికెట్లు సాధించాడు.

కాగా, దక్షిణాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గార్ భారత పేసర్ ఉమేశ్ బౌలింగ్ లో తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో అతని బదులు కాంకషన్ సబ్ స్టిట్యూట్ గా థియొనిస్ డిబ్రుయిన్ బ్యాటింగ్ ఆర్డర్ లోకి వచ్చాడు. అంతేకాదు, టీమిండియాలోనూ ఇలాంటి మార్పే జరిగింది. కీపింగ్ చేస్తూ సాహా గాయపడడంతో రిషబ్ పంత్ కీపింగ్ చేయాల్సి వచ్చింది.

More Telugu News