గవర్నర్‌గా పనిచేసినా రాజకీయాలంటే అసహ్యమంటున్న హాలీవుడ్ నటుడు ష్వార్జ్‌నెగ్గర్

21-10-2019 Mon 09:31
  • 2003 నుంచి 2011 వరకు కాలిఫోర్నియా గవర్నర్‌గా ఆర్నాల్డ్
  • రాజకీయ నేతగా ఊహించుకోలేదన్న మాజీ గవర్నర్
  • ప్రస్తుతం తన సినిమా ప్రమోషన్స్‌లో బిజీ

రాజకీయాలపై కాలిఫోర్నియా మాజీ గవర్నర్, హాలీవుడ్ సీనియర్ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ (72) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలంటే తనకు అసహ్యమని పేర్కొన్నారు. తాను గవర్నర్‌గా పనిచేసినప్పటికీ తానెప్పుడూ రాజకీయ నేతగా తనను తాను ఊహించుకోలేదన్నారు. ఓ ప్రజాసేవకుడిలానే పనిచేశానని చెప్పుకొచ్చారు. గవర్నర్‌గా పనిచేసిన కాలంలో పౌరుల జీవన విధానాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేశానన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పారు.

తనది ఆస్ట్రియన్ నేపథ్యం కావడంతో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. 2003 నుంచి 2011 వరకు కాలిఫోర్నియా గవర్నర్‌గా పనిచేసిన ష్వార్జ్‌నెగ్గర్ తనకు రాజకీయాలంటే అసహ్యమని చెప్పడం గమనార్హం. కాగా, వచ్చే నెల 1న ఆర్నాల్డ్ నటించిన  ‘టెర్మినేటర్: డార్క్‌ ఫేట్’  ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌లో ష్వార్జ్‌నెగ్గర్ బిజీగా ఉన్నారు.