Pankaj Munde: ఎన్నికల ప్రచారంలో స్పృహ తప్పిన మహారాష్ట్ర మంత్రి పంకజ్ ముండే!

  • ఊపిరి సలపని ప్రచార షెడ్యూల్
  • ప్రసంగిస్తూ సొమ్మసిల్లిన పంకజ్ ముండే
  • ఆసుపత్రిలో కోలుకుంటున్నారన్న బీజేపీ

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, ప్రచారానికి చివరి రోజైన శనివారం నాడు విస్తృతంగా పర్యటించిన రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి పంకజ ముండే, అలసిపోయి స్పృహ తప్పి పడిపోయారు. బీడ్ జిల్లాలోని పార్లిలో ఓ ఎన్నికల ర్యాలీలో ఆమె పాల్గొని ప్రసంగిస్తున్న వేళ, ఈ ఘటన జరిగింది. అక్కడే ఉన్న పార్టీ నాయకులు ఆమెను హుటాహుటిన దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారని, ఊపిరి సలపని ప్రచార షెడ్యూల్ కారణంగానే ఆమె సొమ్మసిల్లారని బీజేపీ ప్రతినిధి శిరీశ్ బోరాల్కర్ తెలిపారు.

కాగా, పార్లి అసెంబ్లీ నియోజకవర్గంలో తన కజిన్ ధనంజయ్ ముండేకి ప్రత్యర్థిగా పంకజ ముండే పోటీ పడుతున్నారు. ఎన్నికల ప్రచారం నిన్న సాయంత్రం 6 గంటలతో ముగియగా, సోమవారం నాడు పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశామని ఎన్నికల సంఘం ప్రకటించింది. మహారాష్ట్రతో పాటు హర్యానాలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయన్న సంగతి తెలిసిందే. ఈ రెండు రాష్ట్రాలతో పాటు, దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పలు అసెంబ్లీ నియోజకవర్గాలకూ ఉప ఎన్నికలు జరిపించేందుకు ఈసీ ఏర్పాట్లు చేసింది.

More Telugu News