Andhra Pradesh: ఈ ప్రశ్నకు సీఎం జగన్, ఆయన పార్టీ తప్పకుండా సమాధానం చెప్పాలి!: జీవీఎల్

  • ఓడిపోయిన టీడీపీతో అనుబంధం మాకెందుకు?
  • ఏపీలో ఓ శక్తిగా ఎదగాలని అనుకుంటున్నాం
  • వేరే పార్టీని ఉద్ధరించాల్సిన అవసరం మాకు లేదు

ఓడిపోయిన తెలుగుదేశం పార్టీతో అనుబంధం పెంచుకోవాల్సిన అవసరం తమ పార్టీకి లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో ఓ శక్తిగా ఎదగాలని తాము అనుకుంటామే తప్పా, వేరే పార్టీని ఉద్ధరించాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. ఏపీలో ఏ పార్టీతోనూ కలిసి వెళ్లే ఉద్దేశం బీజేపీకి కచ్చితంగా లేదని అన్నారు.

ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు గురించి ఆయన ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టు విషయంలో తప్పులు జరిగాయని గతంలో తాము చెప్పామని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని అన్నారు. రూ.2,200 కోట్ల అవినీతి జరిగిందని చెబుతున్న ప్రభుత్వం దీనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని మరోమారు ప్రశ్నిస్తున్నట్టు చెప్పారు. ఈ ప్రశ్నకు సీఎం జగన్, ఆయన పార్టీ తప్పకుండా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

రాజధాని అమరావతి విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వానికి తమ డిమాండ్ ఇదే అని, గత ప్రభుత్వం ఎక్కువ ధరకు భూములను కొనుగోలు చేసి, తక్కువ ధరకు ఈ భూములను ఎవరికి కేటాయించారన్న సమాచారం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది కదా, తప్పు ఎవరైతే చేశారో వారిపై చర్యలు తీసుకోకుండా ఎందుకు నీళ్లు నములుతోంది? అని ప్రశ్నించారు.

More Telugu News