ప్రభుత్వ ఉద్యోగులకు సంఘాలు ఉన్నప్పుడు కార్మికులకు ఉండొద్దా?: వీహెచ్

18-10-2019 Fri 15:30
  • సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తిన వీహెచ్
  • కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శలు
  • సమ్మె 14వ రోజుకి చేరినా చలనం లేదంటూ వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన సాగుతోందని, కార్మికులకు జీతాలు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినా ఇప్పటివరకు జీతాలు చెల్లించడంలేదని సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వ ఉద్యోగులకు సంఘాలు ఉన్నప్పుడు కార్మికులకు సంఘాలు ఉండకూడదా? అని నిలదీశారు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 14వ రోజుకు చేరిన నేపథ్యంలో వీహెచ్ మీడియా ముందుకు వచ్చారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, గతంలో ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారంటూ వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసిన కేసీఆర్ ఇప్పుడు చేస్తున్నదేంటి? అని ప్రశ్నించారు. సమ్మె మొదలై రెండు వారాలు గడుస్తున్నా సర్కారులో చలనం లేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ సమ్మె పర్యవసానంగా రాష్ట్రంలో ఐదుగురు మరణించారని, వారి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.